ఆ విషయంలో బాబు నుంచి బాలయ్య వరకు అందరూ 'మగా'నుభావులే

ఆదివారం, 5 మార్చి 2017 (01:41 IST)
అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రాల్లోనూ గౌరవనీయమైన చట్టసభల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతున్న పురుషపుంగవులు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ మహిళలను చులకన చేస్తున్న ఉదంతాలు తరచు వార్తలకెక్కుతూనే ఉన్నాయి. మహిళల సాధికారితకు కట్టుబడి ఉన్నామంటూ బహిరంగ వేదికలపై ప్రగల్భాలు పలికే నేతల నోటనే ఏదో ఒక సందర్భంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలూ వెలువడుతున్నాయి. మన దేశంలో మహిళలు ఇంకా మట్టిముద్దల్లానే ఉంటున్నారా లేకుంటే వాళ్ల గురించి చట్టాలు చేస్తున్న మగాళ్లు అలాగే అనుకుంటున్నారా అనేది అర్థం కావటం లేదు. చట్టసభల్లోని వారే కాదు, అధికార యంత్రాంగంలో ఉన్నత పదవుల్లో ఉంటున్న వారు, వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు పొందిన ప్రముఖులు సైతం మహిళల పట్ల నోరు జారిన ఉదంతాలు ఉన్నాయి. గడచిన కొన్నేళ్లలో మహిళలపై ప్రముఖులు నోరుజారిన సందర్భాలు మచ్చుకు కొన్ని...
మహిళలను వాహనాలతో పోల్చిన ఏపీ స్పీకర్, తప్పేముందన్న చంద్రబాబు
‘ఒక వాహనం కొని షెడ్డులో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకువెళితే ప్రమాదాలు జరుగుతాయి. స్పీడు ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి... మహిళల పరిస్థితి కూడా అంతే. వారు పాత రోజుల్లో మాదిరిగా వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలంటూ బయట తిరుగుతూ సమాజానికి ఎక్స్‌పోజ్‌ అవుతున్నారు. అందుకే వేధింపులకు గురవుతున్నారు...’ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యలివి.
 
విజయవాడలో జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మీడియాకు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో కూర్చున్న పాత్రికేయుల ముఖకవళికలు ఇబ్బందికరంగా మారడంతో పరిస్థితిని గ్రహించి, అప్పటికప్పుడే దిద్దుబాటు వ్యాఖ్యలనూ సంధించారు. అలాగని మహిళలు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయవద్దు అని కాదని... స్వీయరక్షణ కోసం మహిళలు కుంగ్‌ఫూలాంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు తీసుకోవాలని, అప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అయితే, స్పీకర్‌ కోడెల వ్యాఖ్యలపై దుమారం రేగనే రేగింది.
 
జాతీయ మీడియా కూడా ఆయన వ్యాఖ్యలపై కథనాలను ప్రచురించింది. ఈ దుమారం సద్దుమణగక ముందే జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొనాల్సిన వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టడమే తడవుగా పోలీసులు ఆమెను అడ్డుకుని, నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతీయ మహిళా పార్లమెంటులో పాల్గొనకుండా ఒక శాసనసభ్యురాలిని అడ్డగించడం ఏమాత్రం సబబు కాదంటూ విమర్శలు చెలరేగాయి. శాసన, అధికార వ్యవస్థలు సైతం మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయనేందుకు ఇదొక తాజా ఉదాహరణ.ఎందరో ‘మగా’నుభావులుమహిళలపై నోరు పారేసుకుని వివాదాల్లో చిక్కుకున్న ‘మగా’నుభావులు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉంటూ మహిళలను కించపరచేలా, లింగవివక్షను ప్రోత్సహించేలా కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కొన్ని...
 
కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా: చంద్రబాబు
‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే.  ఇక ఎమ్మెల్యే హోదాలో కొనసాగుతున్న ఆయనగారి వియ్యంకుడు, తెలుగు సినీకథానాయకుడు బాలకృష్ణ మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ... ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి... కడుపైనా చేయాలి...’ అంటూ తన వాక్‌ప్రతాపాన్ని ప్రదర్శించడంపై సిటిజన్లు, నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడిన వైనం కూడా తెలిసిందే. ఇలాంటి ‘మగా’నుభావులు దేశవ్యాప్తంగా ఉన్నారు. వారిలో కొందరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు...
 
‘అమ్మాయిలకు పదహారేళ్లకే పెళ్లిళ్లు చేసేయాలి. వాళ్ల లైంగికావసరాలకు భర్తలు అందుబాటులో ఉంటారు. వాళ్లకు ఇంకెక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాదు. అలాగైతేనే వారిపై అత్యాచారాలు జరగకుండా ఉంటాయి’ అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న వార్తలను కొందరు పాత్రికేయులు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఇలా స్పందించారు. పద్దెనిమిదేళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చట్టవిరుద్ధమని దేశంలోని చట్టాలు స్పష్టంగా చెబుతుంటే, ఆయన మాత్రం చట్టాలూ గిట్టాలూ జాన్తా నై అన్నట్లుగా తనకు తోచిన విరుగుడు అప్పటికప్పుడు చెప్పేసి, విమర్శలకు గురయ్యారు.
 
‘అత్యాచారాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతాయి. పట్టణాల్లోని పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అందుకు కారణం. గ్రామీణ భారతంలో ఇలాంటి సంఘటనలు జరగవు’ ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలివి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను, ఆ సంఘటనలకు అద్దం పడుతున్న జాతీయ నేర గణాంకాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన యథాలాపంగా చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి.
 
‘అబ్బాయిలు ఎంతైనా అబ్బాయిలే... వాళ్లిలాంటి పొరపాట్లు చేయడం సహజం’ అంటూ ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ సెలవిచ్చారు. ‘అమ్మాయిలకు, అబ్బాయిలకు ఏవో గొడవలున్నాయి. అమ్మాయి వెళ్లి తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసింది... పాపం ఆ అబ్బాయిల్లో ముగ్గురికి ఉరిశిక్ష పడింది. అత్యాచారం కేసులు ఉరిశిక్షకు దారితీయాలా.. ఇలాంటి చట్టాలను మార్చడానికి ప్రయత్నిస్తాం’ అని అన్నారు. ముంబైలో జరిగిన గ్యాంగ్‌రేప్‌ సంఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడిన సందర్భంగా ఆయన ఒక బహిరంగ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ మీడియాలో దుమారం రేపాయి.
 
‘అత్యాచారాన్ని అడ్డుకోలేనప్పుడు దానిని ఆస్వాదించాలి’ట
మహిళలపై కొందరు నాయకులు, ఉన్నతాధికారులు చేసే వ్యాఖ్యలు బొత్తిగా అర్థంలేనివిగా ఉంటున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు మహిళా సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. విమర్శల జడివానకు దారితీస్తున్నాయి. అయినా, ఇలా నోరు పారేసుకుంటున్న వారి ధోరణిలో పెద్దగా మార్పు కనిపించకపోవడం దురదృష్టకరం. మహిళలపై కొందరు చేసిన మరీ దారుణమైన అర్థంలేని వ్యాఖ్యలకు కొన్ని ఉదాహరణలు...
 
‘అత్యాచారాన్ని అడ్డుకోలేనప్పుడు దానిని ఆస్వాదించాలి’... మరీ వికృతంగా అనిపిస్తున్న ఈ మాటలు ఏదో వికృత హాస్యానికి సినిమా విలన్‌ పలికిన డైలాగులు కావు... సాక్షాత్తు సీబీఐ మాజీ అధినేత రంజిత్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలివి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో సీనియర్‌ అధికారి హోదాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే విమర్శలు వెల్లువెత్తాయి. ‘అత్యాచారం కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం చెప్పమంటారు దీనికి మా దగ్గర సమాధానాలు లేవు. నక్షత్రాలు అనుకూలంగా లేవు’ అంటూ నెపం నక్షత్రాల మీదకు, గ్రహగతుల మీదకు నెట్టేసిన పెద్దమనిషి ఏ జ్యోతిషుడో కాదు... సాక్షాత్తు ఛత్తీస్‌గఢ్‌ మాజీ హోంమంత్రి నాన్కీరామ్‌ కన్వర్‌ చేసిన వ్యాఖ్యలివి.
 
మగాళ్లు, ఆడాళ్లు స్వేచ్చగా తిరుగుతుండ్రు.. అందుకే అత్యాచారాలు
అత్యాచారాలు, లైంగిక వేధింపుల వంటి సంఘటనల్లో నెపం బాధితులపైకి నెట్టేసి అర్థంలేని వ్యాఖ్యలతో వార్తలకెక్కిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు మహిళలు సాటి మహిళల పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా నోటి దురుసుతనాన్ని చాటుకున్న ఉదంతాలు మచ్చుకు కొన్ని... ‘మహిళలపై జరిగే నేరాలకు మహిళలు కూడా సమాన బాధ్యులే’ అని సాక్షాత్తు ఛత్తీస్‌గఢ్‌ మహిళా కమిషన్‌  చైర్‌పర్సన్‌ హోదాలో విభారావు అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు విమర్శలు గుప్పించాయి. ‘ఇదివరకటితో పోలిస్తే మహిళలు, పురుషులు పరస్పరం స్వేచ్ఛగా కలిసి తిరుగుతున్నందు వల్లనే దేశంలో అత్యాచార సంఘటనలు పెరుగుతున్నాయి’ అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి.
 
ఇలాంటి మగానుభావులు, మహిళామణులు ఉన్న దేశంలో స్త్రీలపై వేధింపులు, హత్యాకాండలు, నేరాలు పెరగక చస్తాయా?
 
 
టాగ్లు TDP leaders, vulgar comments, womens, మహిళాలు, అసభ్యకర వ్యాఖ్యలు, టిడిపి నేతలు

వెబ్దునియా పై చదవండి