పెళ్లికి వెళ్లిన బాలిక... దారిమధ్యలో అడ్డగించి సామూహిక బలాత్కారం
గురువారం, 8 అక్టోబరు 2020 (18:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన హత్రాస్ హత్యాచార ఘటన మంటలు దేశంలో చల్లారకముందే ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడకకు హాజరై ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రాత్రంతా బాలికను బంధించే ఉంచిన నిందితులు తెల్లవారుజామున వదిలేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాధితురాలు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. గత జూలైలో కొండగావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత జూలైలో బాధిత బాలిక స్నేహితుడితో కలిసి ఓ పెళ్లికి వెళ్లింది. పెండ్లి నుంచి తిరిగి వస్తుండగా అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు.
అక్కడికి మరో ఐదుగురిని పిలిపించుకుని ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా బాలికతోనే గడిపిన నిందితులు తెల్లవారుజామున ఆమెను వదిలేశారు. అవమానభారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఏం చేయాలో తోచక మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే ఆ తర్వాత కూడా నిందితులను శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. దీంతో తన కూతురుకు న్యాయం జరుగలేదని కలతచెందాడు. మనోవేదన భరించలేక అక్టోబర్ 6న ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో స్థానిక మీడియా సంస్థలన్నీ జరిగిన ఘోరం గురించి తెలుసుకుని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టానికి తరలించారు. అయితే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న బాధిత కుంటుంబం ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఈ విషయమై గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఖాకీలు బుకాయిస్తున్నారు.