బీహార్ తప్పును సవరించుకున్నారు..యూపీలో లెక్క సరిచేశారు. అదే కమల విజయం
ఆదివారం, 12 మార్చి 2017 (03:29 IST)
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటముల బాధ్యతను పూర్తిగా నెత్తిన పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అనుయాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమితషా గత తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు కనుకే ఇద్దరూ కలిసి యూపీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరానికి చేర్చారు. యూపీలో బీజీపే సాధించిన అఖండ విజయం ఏమాత్రం గాలివాటం గెలుపు కాదు! ఈ విజయం వెనుక అనేక పక్కా వ్యూహాలు దాగున్నాయి. వాటిలో కులాల సమ్మేళనాన్ని బీజేపీ అద్భుతంగా కూర్చింది. స్థానిక నాయకత్వానికి సరైన ప్రాధాన్యత నిచ్చింది. ఏపార్టీలో ఉన్నా గెలుపుగుర్రాలను కోరి తెచ్చుకుని మరీ టిక్కెట్లు ఇచ్చింది. మోదీని ప్రచార సునామీగా చేసి ఓటర్లను అమాంతంగా లాగేశారు. కులం మతం పేరెత్తకుండానే హిందువుల ఓట్లను కొల్ల గొట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా యువతను మోదీ ఆకర్షించారు. అదెలా జరిగిందంటే.
..
‘సోషల్ ఇంజనీరింగ్’... అంటే కులాలు, సామాజిక వర్గాల సమీకరణ, సమ్మేళనం! ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది మాయావతి పేరే! కానీ, ఇదే సోషల్ ఇంజనీరింగ్‌ను తమదైన శైలిలో మోదీ-షా ద్వయం అమలు చేసింది. ‘బీజేపీ అగ్రవర్ణాల పార్టీ’ అనే ముద్రను చెరుపుకొంటే తప్ప అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గ్రహించింది. నాన్-యాదవ, నాన్-జాట్ సామాజిక వర్గాల్లో పలుకుబడి ఉన్న నేతలందరినీ తనవైపునకు తిప్పుకున్నది. ఎంబీసీ వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర పార్టీ సారథిగా నియమించింది. పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్న కుర్మీ సామాజిక వర్గానికి చెందిన అనుప్రియ పటేల్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఏకంగా 150 స్థానాలను ఎంబీసీలకు కేటాయించడం గమనార్హం. యాదవేతర ఓబీసీ కులాలను ఏకం చేయడంలో... అప్నాదళ్, వంటి స్థానిక పార్టీలతో పొత్తు కూడా కలిసి వచ్చింది.
బిహార్‌లో స్థానిక నాయకత్వాన్ని విస్మరించి బీజేపీ భారీ మూల్యం చెల్లించుకుంది. ప్రచారంలో మోదీ ప్రధాన ఆకర్షణగా నిలిచినా... స్థానిక నేతలందరికీ ప్రాధాన్యం లభించింది.
ఏ నియోజకవర్గంలో ఎవరికి మంచి పేరుంది ఎవరు గెలుస్తారు దీనిపై బీజేపీ భారీ కసరత్తు చేసింది. ‘గెలుపు గుర్రం’ మరో పార్టీలో ఉన్నా సరే... ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానించింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వంద మందికి పైగా నేతలకు టికెట్లు ఇచ్చింది.
‘ప్రచార సునామీ’ లో ఇతర పక్షాలు కొట్టుకుపోయేలా బీజేపీ నేతలు వ్యూహం రచించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మోదీ యూపీలో 10 ప్రచార సభల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంది. కానీ ఏకంగా 30 ర్యాలీల్లో పాల్గొన్నారు. చివరి దశ పోలింగ్‌కు ముందు ఏకంగా వారణాసిలో తిష్ట వేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా తానే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడూ మోదీ వారణాసిలో రాత్రి బస చేయలేదు.
ఎన్నికల నియమావళి ప్రకారం కులం, మతం పేరిట ఓట్లు అడగడం నిషిద్ధం! కానీ... ఆ మాటెత్తకుండానే ‘హిందువుల’ ఓట్లను మోదీ కొల్లగొట్టారు. ప్రచారంలో ‘వివాదాస్పదం’ అనిపించే అనేక వ్యాఖ్యలు చేశారు. ‘‘రంజాన్ రోజును కోతలులేని కరెంటు ఇస్తే... దీపావళి రోజూ ఇవ్వాలి. కబర్‌స్థాన్‌కు కరెంటు ఇచ్చినట్లే, శ్మశానాలకూ ఇవ్వాలి’’ అని మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
యువతలో మోదీపై క్రేజ్ ఎక్కువ! అది యూపీ ఎన్నికల్లో మరింత పెరిగింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పదేపదే ప్రవచిస్తున్న ‘సెక్యులరిజం’ యువతకు మరోరకంగా అర్థమైంది. ‘సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకం’ అని, తమకు ఏకైక దిక్కు మోదీయే అని భావిస్తూ కమలానికి యువత జై కొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ పద్యాన్ని రివర్స్ చేస్తే ఆరు కారణాలు యూపీలో బీజేపీ పంట పండించాయి.