సోషల్ మీడియాలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. గోరంత విషయం జరిగినా అది కొండంతగా మారి కూర్చుంటుంది. తాజాగా ముంబైకి చెందిన అనీఖా గనీ అనే ముస్లిం మహిళా డాక్టర్ ట్విట్టర్ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే? సామాజిక మాధ్యమాల్లో ఎవరి వాదన వారిది. తాజాగా ముస్లిం మతంపై చేసిన వ్యాఖ్యలను అనీఖా గనీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆగ్రహంతో ''కీర్తన్.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే.. మా డయాలసిస్ వార్డులో రక్తశుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు'' అంటూ నోరుజారారు.
అంతటితో ఆగకుండా ముస్లింల మీద సోషల్ మీడియాలో వేదికగా దాడికి దిగేకంటే.. నేరుగా సరిహద్దు వద్దకు వెళ్ళి పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఏ)కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కుల, మత, ప్రాంత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నేరమని, డాక్టర్‌పై చర్యలు తప్పవని సమాచారం.