బ్రా తొలగిస్తేనే పరీక్షకు కూర్చోబెట్టారు. తల్లి చేతిలో విద్యార్థిని బ్రా.. నీట్‌ ఆంక్షలు

సోమవారం, 8 మే 2017 (05:43 IST)
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) చరిత్రలో ఎన్నడూ లేనంత కళంకానికి గురైంది.  దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష సందర్భంగా డ్రెస్ కోడ్ పై పెట్టిన ఆంక్షలపై అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. విద్యార్థినులు బ్రాలు ధరించివస్తే పరీక్షకు కూర్చోనివ్వలేదు. వేసుకున్న జీన్స్‌దుస్తులకు మెటల్ బటన్స్ ఉండటాన్ని కూడా అధికారులు ఒప్పుకోలేదు. పొడవు చేతులు చొక్కాలు వేసుకొస్తే కత్తిరించేశారు. హెయిర్‌ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ కూడా తీసివేయించారు. నీట్ పరీక్షకు సంబంధించి ఇంత అవమానకరమైన పరిస్థితులను ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇది క్షాత్ర పరీక్షా, కుల పరీక్షా అంటూ దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ నలభై ఏళ్ల క్రితం వేసిన ప్రశ్నను తాజాగా అప్లయి చేసుకుంటే ఇది నీట్ పరీక్షా లేక బ్రా పరీక్షా అని చెప్పుకోక తప్పదు..  కేరళ లోని కన్నూరులోని ఒక పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షకు కూర్చునే ముందు బ్రా తొలగించి రావాలని ఆంక్ష విధించడంతో ఆమె నిర్ఘాంతపోయింది. ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవడంతో పరుగున బయటకొచ్చిన తమ అమ్మాయి నా చేతిలో టాప్ ఇన్నర్‌వేర్ పెట్టి వెళ్లిపోయింద’ని ఆమె తల్లి ఆవేదనతో చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థిని ఆగ్రహంతో ఈ విషయాన్ని మీడియాకు చెప్పడంచో విద్యార్ధినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
 
జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు ధరించిన జీన్స్‌కు మెటల్ బటన్స్‌ ఉండడంపై కూడా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ కేంద్రాల్లో పలుచోట్ల అభ్యర్థులకు ఇలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే పొడవు చేతుల చొక్కాలు వేసుకొస్తే కత్తిరించేశారు. హెయిర్‌ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ తీసేయాల్సి వచ్చిందని పలువురు విద్యార్థినులు చెప్పారు.

విద్యార్థులను అడ్మిట్‌కార్డు, హాల్‌టికెట్, ఐడీ కార్డులు తప్ప మరెలాంటివీ పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. వస్త్రధారణ, అలంకరణపై కఠిన నిబంధనలు అమలు చేశారు. అబ్బాయిలు, అమ్మాయిలు పొడుగు చేతుల వస్త్రాలు, పైజామా, కుర్తా, బూట్లు, హైహీల్స్, వాచీలు వంటివి ధరించడంపై ఆంక్షలు విధించారు. ఇవేగాకుండా గాజులు, జుట్టుకున్న పిన్నులు, కాళ్ల పట్టీలు, మెడలోని బంగారు ఆభరణాలు, ఉంగరాల వంటివాటిని తొలగించాకే పరీక్షా హాల్లోకి రానిచ్చారు. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెవిపోగులు, ముక్కు పుడకలు వంటివి తీసే సమయంలో కొంత మందికి గాయాలై రక్తం కారింది. దీంతో కొందరు కంటతడి పెట్టారు కూడా. 

కేరళలో చాలా మంది  విద్యార్థినులు జీన్స్ వంటి దుస్తులు ధరించి రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దాంతో విద్యార్థినులకు స్థానికులు దుస్తులు అందించారని, దగ్గర్లోని ఓ ముస్లిం కుటుంబం ఒక్కటే ఆరు జతల దుస్తుల్ని అందించిందని స్థానికులు తెలిపారు. ఇక చెన్నైలో పొడుగు చేతుల చొక్కాలతో పరీక్షకు హాజరైన విద్యార్థులు.. పరీక్షా కేంద్రాల వద్దే చొక్కాల చేతులను కత్తిరించుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి