జల్లికట్టు బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఓకే... ఇకపై పోట్లగిత్తల పరుగులు చట్టబద్ధమే....
సోమవారం, 23 జనవరి 2017 (17:36 IST)
తమిళనాడు సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు ఆర్డినెన్స్ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్రవేసింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో జల్లికట్టు బిల్లును ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రవేశపెట్టారు. సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది.
ప్రతి యేడాది మకర సంక్రాంతి రోజున నిర్వహించాల్సిన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు గతంలో నిషేధం విధించిన నేపథ్యంలో ఈ ఏడాది తమిళ ప్రజలు నిరసన గళం విన్పించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఆ క్రీడను తాత్కాలికంగా నిర్వహించేందుకు అవకాశం కల్పించినా.. విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు.
జల్లికట్టు నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెప్పడంతో సీఎం పన్నీర్ సెల్వం సోమవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ ప్రకారంగానే సోమవారం ఉదయం ఈ బిల్లును ప్రవేశపెట్టిన తమిళనాడు సీఎం పన్నీర్.. సాయంత్రం మరోమారు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు చట్టపరంగా సాగనున్నాయి.
జల్లికట్టు పోటీల నిర్వహణకు రూపొందించిన ఆర్డినెన్స్ బిల్లులో పేర్కొన్న నిబంధనలు ఇవే...
జల్లికట్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలి. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులు, వీరులకు జిల్లా కలెక్టర్ నుంచి ముందే అనుమతి పొందాలి. జల్లికట్టుకు అనుమతులు జారీ చేసే కలెక్టర్ పోటీలు జరిగే ప్రాంతాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.
రెవెన్యూ, పశుసంవర్థక, పోలీస్, ఆరోగ్యశాఖలకు చెందిన అధికారులతో ఓ కమిటీని నియమించి, పోటీలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అని కలెక్టర్ పర్యవేక్షించాలి. జల్లికట్టు పోటీలో పాల్గొనే ఎద్దులకు మద్యం, మత్తు పదార్ధాలు ఇవ్వలేదని, పశువులు ఆరోగ్యంగానే ఉన్నాయని పశుసంవర్థక శాఖ వైద్యులు ధృవీకరించాలి.
పోటీలో పాల్గొనే ముందు ఎద్దులకు 20 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఒక్కో ఎద్దుకు 60 చదరపు అడుగుల చోటు కల్పించి వాటికి మేత, నీరు ఇవ్వాలి.
ఎద్దులను నిలిపే ప్రాంతంలో పందిరి వేసి ఎండ వేడిమి తగలకుండా చూసుకోవాలి. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అవసరమైన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చి పోటీలను నమోదు చేయాలి.
వాడివాసల్ ప్రాంతానికి ఎద్దులను తీసుకువెళ్లి పరిగెత్తించే ముందు వాటి ముక్కుతాడును యజమానే తొలగించాలి. వాడివాసల్ నుంచి బయటకు పరుగెత్తే ఎద్దులను యువకులు అడ్డుకోకూడదు. పరిగెత్తే ఎద్దులను కొమ్ములు, తోకపట్టుకొని అదుపు చేయరాదు. వాడివాసల్ నుంచి పోటీ ముగిసే ప్రాంతం వరకు ఎద్దులు పరిగెత్తు సమయం 60 సెకన్ల నుంచి 120 సెకన్లలోపు ఉండాలి.
ఎద్దులను అదుపుచేసే యువకులకు వైద్యపరీక్షలు నిర్వహించి యూనిఫాం, గుర్తింపుకార్డు కలెక్టర్ పంపిణీ చేయాలి. పోటీలు జరిగే ప్రాంగణంలో గాయపడే ఎద్దులు, వీరులకు చికిత్సలు అందించేందుకు నిర్వాహకులు అంబులెన్స, వైద్యులు, పశుసంవర్ధక శాఖ వైద్యులను అందుబాటులో ఉంచుకోవాలి.