పెళ్లి వేడుకలో అధికార జులుం ప్రదర్శిన కలెక్టర్ సస్పెండ్!

సోమవారం, 3 మే 2021 (14:14 IST)
ఇటీవల త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జిల్లా కలెక్టర్ తన అధికార జులుం ప్రదర్శించారు. ఆడామగా అనే తేడా లేకుండా కంటికి కనిపించిన వారందరిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం త్రిపుర ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ కలెక్టర్‌పై సస్పెండ్ వేటు పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్ శైలేష్‌కుమార్‌ యాదవ్‌ వివాహ వేడుకను మధ్యలో నిలిపివేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అగర్తలాలోని త్రిపుర స్వదేశీ ప్రొగ్రెసివ్‌ రీజినల్‌ అలయన్స్‌ చైర్మన్‌ ప్రదయోత్‌ కిశోర్‌ డెబ్బర్మ యాజమాన్యంలో వివాహ వేదిక వద్ద ఘటన చోటుచేసుకుంది. 
 
రాత్రి 10 గంటల సమయంలో కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన వారందరిపైనా చిర్రుబుర్రులాడుతూ వచ్చారు. స్త్రీ, పురుషులు అన్న తేడా లేకుండా అందరిపైనా చేయి చేసుకుని పెళ్లి వేడుకను ఆపివేయించారు. చివరకు పెళ్లి కుమారుడిపైనా తన ప్రతాపం చూపించారు. అతిథులను వేదిక నుంచి వెళ్లగొట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.
 
అలాగే తన కార్యాలయం జారీ చేసిన వివాహ అనుమతి పత్రాన్ని చింపివేశారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరైనా బాధపడితే క్షమాపణలు కోరుతున్నాను. గతరాత్రి చేసింది ప్రజల ప్రయోజనం, శ్రేయస్సు కోసం మాత్రమే. నా లక్ష్యం ఎవరినీ బాధపెట్టడం, అవమానించడం కాదు’ అని వివరణ ఇచ్చారు. 
 
అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తే సౌమ్యంగా చెప్పాల్సింది పోయి.. ఓ కలెక్టర్‌ స్థాయి అధికారి ఆడా మగా తేడా లేకుండా చేయి చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా.. ఈ ఘటనలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు విధుల నుంచి వైదొలిగేందుకు ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపినట్లు త్రిపుర న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌ నాథ్‌ తెలిపారు.
 
ఈ వ్యవహారంపై త్రిపుర సీఎం బిప్లబ్‌కుమార్‌ దేబ్‌ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయగా ఈ వారం ప్రారంభంలో కమిటీ ఎదుట హాజరయ్యారు. 'శాంతిభద్రలు అమలు చేయడం, కరోనా వ్యాప్తిని నివారించడం నా బాధ్యత. ఆ రోజు రాత్రి నేను చేసినదానికి కట్టుబడి ఉన్నాను'  అని కమిటీ ముందు చెప్పారు. 
 
మరోవైపు, ఆయనను సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యేలు ఆషిష్‌ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌కు లేఖ రాశారు. పశ్చిమ త్రిపుర జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతిమా భౌమిక్ మాట్లాడుతూ వధువు కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని తెలిపారు. పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం కలెక్టర్ శైలేష్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు