మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తికి 'నమస్తే ట్రంప్' కారణం : సంజయ్ రౌత్

ఆదివారం, 31 మే 2020 (17:07 IST)
దేశంలో కరోనా వైరస్ అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలను శివసేనకు చెందిన ఎంపి సంజయ్ రౌత్ వివరించారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం వల్లే గుజరాత్, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కరోనా బీభత్సం కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలమంది ప్రజలు వచ్చారని, వారంతా తిరిగి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కరోనా వ్యాప్తి అధికమైందన్నారు. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో ప్రజలు రావడమే కరోనా వ్యాప్తికి కారణమని, ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా సమర్థించుకోగలదని వ్యాఖ్యానించారు. 
 
ట్రంప్ వెంట అమెరికా నుంచి వచ్చిన కొందరు ముంబై, ఢిల్లీ వంటి నగరాలను సందర్శించారని, ఇలాంటి పరిణామాలే దేశంలో కరోనా వ్యాప్తికి దారితీశాయని రౌత్ విమర్శించారు. ఈ మేరకు సామ్నా పత్రికలోని తన సంపాదకీయంలో పేర్కొన్నారు.
 
కాగా, ప్రస్తుతం చైనాలో 62228 కరోనా పాజిటివ్ కేసుల ఉండగా, 2098 మంది చనిపోయారు. అలాగే, దేశంలో 1.82 లక్షల కేసులు నమోదైవుండగా, 5164 మంది ఇప్పటివరకు చనిపోయారు. 86984 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు