విశాఖ ఉక్కును తెగనమ్మడం ఖాయం : కేంద్రం స్పష్టీకరణ

మంగళవారం, 23 మార్చి 2021 (10:58 IST)
ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును తెగనమ్మడం ఖాయమని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదా విలీనం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. 
 
అయితే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఖరారు సమయంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన మిగులు భూములు, అప్రధానమైన ఆస్తులను పక్కకు పెట్టే విషయం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 
 
విశాఖ ఉక్కు ప్లాంట్ అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగింది. నిర్దిష్ట అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని,  అవసరమైనప్పడు దాని మద్దతు కూడా కోరతామన్నారు. 
 
విశాఖ ఉక్కులో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించిందని.. ఇందుకోసం విధి విధానాలను రూపొందించేందుకు అంతర్‌ మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 
 
నూతన ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం.. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉంటుందని, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేయడమో, లేక మరో సంస్థలో విలీనం చేయడమో జరుగుతుందని వివరించారు. ప్రైవేటీకరణ సాధ్యం కాకుంటే వాటిని మూసివేసే విషయం కూడా పరిశీలిస్తామని మంత్రి అనురాగ్ ఠాగూరు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు