కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారని, దీనిపై బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలిపారు. మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్‌డౌన్ విధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
అలాగే, వచ్చే 19 రోజుల పాటు కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్‌డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని జావదేకర్ సూచించారు.
ఎన్నో ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని, విజయం సాధించలేక అల్లాడుతున్నాయని, దేశ ప్రజలంతా విధిగా అన్ని నిబంధనలూ పాటిస్తే, కరోనాపై యుద్ధంలో తప్పక గెలిచితీరుతామన్నారు. కేంద్రానికి ప్రజల మద్దతు తప్పనిసరని అభిప్రాయపడ్డ జావదేకర్, ఈ మహమ్మారికి విరుగుడును శాస్త్రవేత్తలు త్వరగా కనిపెట్టాలని కోరారు.