ప్రధాని మోడీ ఫోన్ చేశారు.. నా ఆలోచనలు ఆయనకు చెప్పాను : చంద్రబాబు
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (15:08 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 'లాక్‌డౌన్ అంశం ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. ఇదేసమయంలో ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు' అని చెప్పుకొచ్చారు.
'కొన్ని రాష్ట్రాలు కరోనాను సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి.. మరికొన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సమస్యకు పరిష్కారం. నిబంధనలకు పకడ్బందీగా అమలు చేయాలి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వెళ్లకుండా చూడాలి' అని చెప్పారు.
'అనుమానితుల నమూనాలు తీసుకుని పరీక్షించడం మన రాష్ట్రంలో తగ్గాయి. ల్యాబ్‌లు పెంచుకుని ఎక్కువ మంది నుంచి నమూనాలు సేకరించాలి. ఎక్కువగా నమూనాలు తీసుకుంటే దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కంటికి కనిపించని శత్రువు కరోనా. లాక్‌డౌన్‌తో కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నాం' అని తెలిపారు.
అంతేకాకుండా, 'ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మన తెలివి తేటలను, సూచనలు పంచుకోవాలి. నేను సోమవారం ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి మోడీగారితో మాట్లాడాలని కోరా .. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన ఫోనుకి ప్రతి స్పందిస్తూ ఈ రోజు (మంగళవారం) ఉదయం 8.30 గంటలకు మోడీ నాకు ఫోను చేసి మాట్లాడారు. నా ఆలోచనలను ఆయనకు చెప్పాను' అని చంద్రబాబు వివరించారు.
అంతేకాకుండా, దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ప్రధాని మోడీ అనేక చర్యలు తీసుకున్నారు. విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, ప్రతిపక్ష పార్టీల నేతలు అందరితోనూ మాట్లాడారు.. ఇది చాలా ముఖ్యం అని గుర్తుచేశారు.
అంతేకానీ, "నాకు అన్నీ తెలుసు, ఎవరి సూచనలూ తీసుకునే అవసరం లేదనే అహంకారం ఏ నాయకుడిలోనూ ఉండకూడదు. కరోనాపై అందరి సలహాలు సూచనలు తీసుకోవాలి. కరోనాపై వీరోచితంగా పోరాడాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్ నిబంధనలు మాట్లాడాలి" అని చంద్రబాబు తెలిపారు.