రెండో పెళ్లి చేసుకున్న మహిళ... ఉమ్మి నాకించిన పెద్దలు... ఎక్కడ?

ఆదివారం, 16 మే 2021 (10:11 IST)
మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన ఓ మహిళ రెండో పెళ్లి చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన గ్రామంలోని కొంతమంది ఆ మహిళతో ఉమ్మి నాకించారు. ఈ దారుణం మ‌హారాష్ట్ర అకోలా జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అకోలా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(35)కు గత 2011లో వివాహ‌మైంది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌కు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన నాథ్ జోగి క‌మ్యూనిటీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేదు.
 
దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోద‌రితో పాటు బంధువుల‌ను కుల పెద్ద‌లు పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్ష విధిస్తున్న‌ట్లు తెలిపారు. అదేంటంటే.. కుల పెద్ద‌లంతా క‌లిసి అర‌టి ఆకుల‌పై ఉమ్మి వేస్తార‌ని, దాన్ని స‌ద‌రు మ‌హిళ నాకాల‌ని ఆదేశించారు. 
 
అంతేకాకుండా రూ.ల‌క్ష జ‌రిమానా వేశారు. ఈ శిక్ష‌పై తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధిత మ‌హిళ‌... శనివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు