కరోనా వైరస్ సోకి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా ఉన్న కమలారాణి వరుణ్ చనిపోయారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. కాగా, గతంలో ఆమె లోక్‌సభ సభ్యురాలిగానూ పనిచేశారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. కమలారాణి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.
ఇదిలావుండగా, శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చనిపోయిన విషయం తెల్సిందే. ఈయనకు కూడా గత పది రోజుల క్రితం వైరస్ సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శనివారం మృతి చెందారు.