నాన్నే నా గురువు.. రాజీనామాకు సిద్ధం... పార్టీలోనే ఉంటా: అఖిలేష్ యాదవ్

సోమవారం, 24 అక్టోబరు 2016 (12:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. నాన్నే నా గురువు అని తేల్చిచెప్పారు. ఆయన తలచుకుంటే తనను సీఎం పీఠం నుంచి దించవచ్చని గుర్తుచేశారు. అదేసమయంలో ఆయన కోరితే రాజీనామాకు సిద్ధమని, రాజీనామా చేశాక కూడా పార్టీలోనే కొనసాగుతానని అఖిలేష్ స్పష్టంచేశారు. 
 
సమాజ్‌వాదీ పార్టీలో రేగిన సంక్షోభం నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ములాయంసింగ్ యాదవ్ మాత్రమే తమ నాయకుడని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీలో కొందరు కుట్రదారులు తయారయ్యారని ఆయన నేరుగా అమర్‌సింగ్‌పై ఆరోపణలు సంధించారు. 
 
అఖిలేష్ సీఎం కాదంటూ గత ఏడాది అమర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను అఖిలేష్ గుర్తుచేశారు. కుట్రను భగ్నం చేసితీరుతామని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తాను పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను ఎప్పటికీ సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటానని అఖిలేష్ తేల్చిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి