రసగుల్లాతో పెళ్లి ఆగిపోయింది.. రణరంగంగా మారిన మ్యారేజ్ హాలు..

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (16:46 IST)
సాధారణంగా వరకట్నం సమస్య లేదా పెళ్లి ఇష్టంలేక వరుడు లేదా వధువు పరారైతే వివాహాలు ఆగిపోతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం రసగుల్లాతో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానై.. వివాహ వేడుకనే కుదిపేసింది. అంతే పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని కుర్మాపూర్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా, డిన్నర్ ప్రారంభం అయ్యింది. ఈ డిన్నర్‌‌ను బఫే పద్ధతిలో ఏర్పాటు వధువు కుటుంబీకులు ఏర్పాటు చేశారు. 
 
డిన్నర్ మెనూలో రసగుల్లా కూడా ఉంది. అయితే రసగుల్లా మనిషికి ఒకటే ఇవ్వాలనే నియమం పెట్టారు వధువు తరపు బంధువులు. అయితే వరుడి కుటుంబీకులు మాత్రం రెండేసి రసగుల్లాలను తీసేసుకున్నారు. అక్కడే సమస్య మొదలైంది. ఈ రసగుల్లా సమస్యే పెను వివాదానికి దారితీసింది. 
 
ఇరు తరపు బంధువులు నువ్వా నేనా అంటూ కొట్టుకోవడంతో.. డిన్నర్ జరిగిన ప్రాంతమే రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనను వధువు కళ్లారా చూస్తుండిపోయింది. అయినా తల్లిదండ్రులను వరుడు తరపు బంధువులు తీవ్రంగా అవమానించడాన్ని సహించలేకపోయింది. అంతే ఈ వివాహం వద్దే వద్దని వధువు నిర్ణయించుకుంది. దీనిపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి