వామ్మో.. శశికళ జైలు నుంచి బయటికి రానుందా? పన్నీర్ సంగతి అంతేనా.. పంచెలూడుతాయా?

శనివారం, 15 ఏప్రియల్ 2017 (17:30 IST)
తమిళనాడు రాజకీయాల్లో హడలెత్తించిన చిన్నమ్మ శశికళ జైలు నుంచి పెరోల్‌లో బయటికి రానున్నట్లు సమాచారం. త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ సోద‌రుడి కుమారుడు టీవీ మహదేవన్ శనివారం గుండెపోటుతో మరణించాడు. తంజావూరులోని మహాలింగేశ్వర ఆలయ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన మహదేవన్ గర్భగుడి ఎదురుగా పూజలు నిర్వహిస్తోన్న స‌మ‌యంలో గుండెపోటుతో అక్క‌డే కుప్పకూలి తుదిశ్వాస వదిలాడు.
 
జయలలిత మృతి చెందిన అనంత‌రం మహదేవన్‌ పార్టీ ఫోరమ్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు. అన్నాడీఎంకే పార్టీలో శశికళ వెంటే ఉండిన టీవీ మహదేవన్ మృతిని తెలుసుకున్న శశికళ.. తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు స‌మాచారం. ఇదే కనుక జరిగితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పంచెలూడటం ఖాయమని.. ముఖ్యంగా దినకరన్‌పై వేటు వేయడానికి చిన్నమ్మ వెనక్కి తగ్గదని పార్టీ వర్గాల సమాచారం. 
 
చిన్నమ్మతో పాటు జయ అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన ఇళవరసి, సుధాకరన్‌లు కూడా పెరోల్ ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు చిన్నమ్మ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆమెను పెరోల్‌లో బయటికి తీసుకురావాలని లాయర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మహదేవన్ మృతిని అడ్డంపెట్టుకుని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శశికళ బయటికి రానున్నట్లు తెలిసింది. 
 
పెరోల్‌ ద్వారా జైలు నుంచి బయటికి వచ్చే శశికళ పార్టీ, కుటుంబ వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దినకరన్‌పై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్కే నగర్ ఎన్నికల్లో శశికళ ఆదేశాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం ద్వారా దినకర్‌ను తప్పించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి