ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఐదు రోజులు కావొస్తుంది. కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై భాజపా పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్‌లతో ఎంపీలు బాబా బాలక్ నాథ్, దియా కుమారి వంటివారు పోటీలో ఉన్నారు. దీంతో సీఎం అభ్యర్థి ఖరారు కమలనాథులకు తలనొప్పిగా మారింది.
ఇదిలావుంటే, రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలతో వసుంధర రాజే సమావేశమయ్యారు. కేవలం మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నప్పటికీ వసుంధర రాజేకు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.
కాగా వసుంధర రాజే 2003-2008 బీజేపీ జాతీయాధ్యక్షురాలిగా, 2013 -2018 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇటీవలే వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగింది. మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరగగా బీజేపీ 115, కాంగ్రెస్ 69, ఇతరులు 15 స్థానాలను గెలుచుకున్నాయి.