అన్నాడీఎంకేకు సారథ్యం వహించండి.. కానీ అమ్మ సంపద ప్రజలకివ్వండి : శశికళతో రాములమ్మ

ఆదివారం, 18 డిశెంబరు 2016 (14:59 IST)
ముఖ్యమంత్రి జయలలిత మరణంతో అన్నాడీఎంకే సారథ్య బాధ్యతలను మీరే చెపట్టాలంటూ జయలలిత స్నేహితురాలు శశికళను సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కోరారు. అయితే, జయలలిత సంపద అంతా ప్రజలకు చెందేలా చూడాలని కోరినట్టు సమాచారం. చెన్నైలో జయలలిత సమాధిని సందర్శించి నివాళులు అర్పించాక విజయశాంతి.. చిన్నమ్మను కూడా కలుసుకున్న సంగతి తెలిసిందే.
 
దీనిపై విజయశాంతి స్పందిస్తూ తన ఆస్తులపై జ‌య‌ల‌లిత ఎవ‌రికి వీలునామా రాశారో అధికారులు చూసుకోవాల్సి ఉంద‌న్నారు. ఒక‌వేళ ఆమె వీలునామాలో ఏమైనా రాసి ఉంటే వారికే చెందుతుంది క‌దా అని వ్యాఖ్యానించారు. తాను మాత్రం జ‌య‌ల‌లిత సంప‌ద అంతా ప్రజలకే చెందితే బాగుంటుంద‌ని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలనే కుటుంబంలా చూసుకున్నారు కాబ‌ట్టి జయలలితకు సంబంధించిన సంప‌దంతా వారికే చెందాల‌ని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే తమిళనాడు రాజకీయాలను, అన్నాడీఎంకేను సమర్థంగా ముందుకు నడిపించగల సామర్థ్యం శశికళకే ఉందన్నారు. అన్నాడీఎంకేలో అంతా చిన్నమ్మగా పిలుచుకునే శశికళే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అవసరమైతే ముఖ్యమంత్రిగా నెగ్గుకురాగలరని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెను తమ నాయకురాలిగా అభిమానించి.. ఆహ్వానిస్తే తప్పేమిటని విజయశాంతి ప్రశ్నించారు. 
 
శశికళ తప్ప మరెవరైనా నాయకత్వానికి పోటీ ఉన్న పక్షంలో పార్టీ రెండుగా చీలిపోయి.. తమిళ రాజకీయాల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. చిన్నమ్మ నాయకత్వమే బెటర్ అని పేర్కొన్నారు. శశికళ పట్ల దివంగత జయలలిత.. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉండేవారని, కొంతకాలం ఇద్దరిమధ్య స్వల్ప విభేదాలు వచ్చినా ఆ తరువాత అవి సర్దుకుపోవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారని విజయశాంతి గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి