వారంతా బచ్చాలు... శశికళను తొలగించలేరు.. పార్టీ మాదేనంటున్న టీటీవీ

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (12:21 IST)
అన్నాడీఎంకే నుంచి తనతో పాటు.. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను బహిష్కరిస్తూ ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల సారథ్యంలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై టీటీవీ దినకరన్ స్పందించారు. వారంతా పార్టీలో బచ్చాలనీ, వారు శశికళను పార్టీ నుంచి తొలగించే అధికారమే లేదన్నారు. పైగా, అన్నాడీఎంకే పార్టీ తమదేనని చెప్పారు. 
 
మంగళవారం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శశికళను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తమదేనని, శశికళను తొలగించడం ఎవరివల్లా కాదన్నారు. ఎటువంటి గుర్తింపూ లేని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలేవీ చెల్లవని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్నారు. 
 
పార్టీకి ప్రధాన కార్యదర్శి ఎన్నటికీ జయలలితేనని, ఆమె ప్రతినిధిగా మాత్రమే శశికళ వ్యవహరిస్తూ వచ్చారని చెప్పిన దినకరన్, తన భవిష్యత్ నిర్ణయంపై మాత్రం మాట దాటవేశారు. పార్టీ నేతలంతా లేకుండా జరిగిన సమావేశం చెల్లదని అన్నారు. కాగా, అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి దినకరన్ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరంతా మైసూర్‌లోని ఓ రిసార్టులో సేదతీరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు