రాజకీయ నేతలకు అధికారులకు ముచ్చెమటలు... నల్లధనం బయటకు తెస్తే ఇబ్బంది.. వదిలేస్తే రూ.కోట్లు వృధా

బుధవారం, 9 నవంబరు 2016 (11:01 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి చేసిన సంచలన ప్రకటన దేశంలోని రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ముఖ్యంగా.. ఈ ప్రకటన తర్వాత వారి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. దేశంలో రూ.500, రూ.1000 విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన స్వదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. 
 
ముఖ్యంగా స్వదేశంలోని అవినీతి రాజకీయ నాయకులకు నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అవినీతి అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోగా నల్ల కుబేరులు బోరున విలపిస్తున్నారు. దేశంలోని కొందరు అవినీతి అధికారుల ఇళ్లలో బస్తాల కొద్దీ నల్లడబ్బు పేరుకుపోయివుంది. మరికొందరు లాకర్లలో భద్రపరుచుకున్నారు. ఈ డబ్బును వెలికి తీసుకొచ్చేందుకు కేంద్రం కొంత సమయం కూడా ఇచ్చింది. దీనికి స్పందించిన కొందరు పన్ను చెల్లించి బ్యాంకుల్లో జమ చేసుకున్నారు. అలా చేయని వారి సొమ్ము చిత్తుకాగితాల్లా మారిపోయింది. 
 
పైగా, తమ వద్ద ఉన్న పెద్దమొత్తాన్ని ఇప్పటికిప్పుడు మార్చుకోవడం దాదాపు అసాధ్యం. బుధ, గురువారాల్లో ఏటీఎంలు, బుధవారం బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు మార్చుకోవాలంటే తప్పనిసరిగా రుజువులు చూపించాల్సి ఉంటుంది. ఇక మార్చుకునేందుకు కూడా ప్రభుత్వం రూ.నాలుగు వేలకు మాత్రమే ఓకే చెప్పింది. మన ఖాతాలో మాత్రం ఎన్ని డబ్బులైనా వేసుకోవచ్చు. అయితే పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనికి ఆదాయ పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని లక్షల రూపాయల వరకు ఓకే కానీ కోట్లకు కోట్లు మార్చుకుంటే మాత్రం చిక్కుల్లో పడక తప్పదు.
 
పలువురు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కేంద్రం నిర్ణయం మింగుడుపడడం లేదు. 2019 ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పలు పార్టీలు డబ్బులు వెదజల్లి విజయం సాధించాలని ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. అందుకు కావాల్సిన సొమ్మును ఇప్పటి నుంచే సమకూర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు పెద్ద నోట్లతో కూడిన బస్తాల కొద్దీ డబ్బును ఇళ్లలో దాచిపెట్టారనే ప్రచారమూ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో అవి చెల్లకుండా పోయినట్టేనని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి