అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం గుర్మీత్ రామ్ రహీంను హెలికాప్టర్‌లో రోహతక్ జైలుకు తరలించారు. తీర్పు వెలువడిన తరువాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో గుర్మీత్ అనుచరులు సృష్టించిన విధ్వంసకాండలో 39 మంది మరణించగా, భారీగా ఆస్తుల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సాధ్వీలతో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కేసులో గుర్మీత్ రామ్‌రహీం దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో కేసు పలు మలుపులు తిరుగుతోంది. కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే రామ్ రహీం జైలుకు వెళ్లిన పక్షంలో ‘డేరా’కు చెందిన ఆస్తులకు వారసులు ఎవరు? వాటిని ఎవరు పర్యవేక్షిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
డేరా జాబితాలో రామ్ రహీం కుమారుడు, కుమార్తెలతో పాటు కొత్తగా మరో యువతి పేరు జతచేరింది. 35 సంవత్సరాల విపశ్యన ఇన్సా అనే యువతే డేరా పర్యవేక్షకురాలనే వార్త వినిపిస్తోంది. విపశ్యన ఆశ్రమానికి చెందిన ఒక సాధ్వి. ఆమెను గురు బ్రహ్మచారి విపశ్యన పేరుతో పిలుస్తుంటారు.