అరెస్టుకు అనుమతిస్తే హక్కుల్ని హరిస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. రాజ్యాంగం ఇచ్చిన హామీల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమైనదని, అరెస్టులు రొటీన్ (నిత్యకృత్యం)గా జరగకూడదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, హృషికేష్ రారులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
అరెస్టులు అనేవి సాధారణంగా చోటుచేసుకుంటే.. అది ఆ వ్యక్తి ప్రతిష్ట, అత్మగౌరవానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితుడు పరారవుతాడని లేదా సమన్లను బేఖాతరు చేస్తాడని ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి అనుకోవడానికి ఎటువంటి కారణం లేకపోతే, అటువంటి సమయంలో అతను లేదా ఆమెను కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
నిందితుడిపై కస్టడీ విచారణ అవసరం అనుకున్నప్పుడు, క్రూరమైన నేరానికి పాల్పడినప్పుడు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదా పరారయ్యే అవకాశం ఉందని భావించే సమయంలో మాత్రమే విచారణ జరుగుతుండగా అరెస్టులు అనేవి చోటుచేసుకోవాలని తెలిపింది.
సిఆర్‌పిఎస్ సెక్షన్ 170లో కనిపించే 'కస్టడీ' అనే పదం పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీ గురించి పేర్కొనదని, ఛార్జిషీట్ దాఖలు చేసే సమయంలో దర్యాప్తు అధికారి నిందితులను కోర్టు ముందు హాజరుపరచడాన్ని ఇది సూచిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఛార్జిషీట్ దాఖలు చేసే సమయంలో నిందితుడిని అరెస్టు చేసే బాధ్యతను ఈ సెక్షన్ సంబంధిత అధికారిపై విధించదని తెలిపింది.