కేన్సర్‌తో మహిళా హక్కుల ఉద్యమ మహిళా నేత మృతి

శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:47 IST)
ప్రముఖ కవయిత్రి, రచయిత, మ‌హిళా హ‌క్కుల ఉద్యమ నాయకురాలు క‌మ్లా భాసిన్ ఇకలేరు. ఆమె శనివారం తెల్లవారుజామున ఢిల్లీలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమెకు వయసు 75 యేళ్లు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
క‌మ్లా భాసిన్ మృతి విషయాన్ని మహిళా హక్కులు ఉద్యమకారిణి అయిన క‌వితా శ్రీవాస్త‌వ నిర్థారించారు. క‌మ్లా భాసిన్‌ మృతి దేశంలో, ద‌క్షిణాసియాలో మ‌హిళా హ‌క్కుల ఉద్య‌మానికి తీర‌నిలోట‌ని క‌వితా శ్రీవాస్త‌వ ఆవేదన వ్యక్తం చేశారు. క‌మ్లా భాసిన్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. 
 
క‌మ్లా భాసిన్ మృతిపై సంతాపం తెలిపిన వారిలో సుప్రీంకోర్టు న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌, ఢిల్లీ డిప్యూటీ సిఎం మ‌నీశ్ సిసోడియా, సోషల్ యాక్టివిస్ట్ హ‌ర్ష్ మందేర్‌, కాంగ్రెస్ అగ్రనేత  శ‌శిథ‌రూర్‌, ప్ర‌ముఖ చ‌రిత్ర‌కారుడు ఇర్ఫాన్ హ‌బీబ్ త‌దిత‌రులు ఉన్నారు. క‌మ్లా భాసిన్ మహిళల హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారని, ఆమె మృతి మహిళా లోకానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి