ఆఫ్రికా దేశాల్లో కనిపించే జికా వైరస్ తొలిసారి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీంతో జికా తొలి కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. పరస్సాలాకు చెందిన 24 ఏళ్ల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ సోకిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
గత నెలలో బాధితురాలు జ్వరం, తలనొప్పితో పాటు , చర్మంపై ఎర్రటి గుర్తులు వంటి లక్షణాలతో హాస్పిటల్‌కి ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని.. ప్రాథమిక పరీక్షలలో ఆమెకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
జికా సోకి చికిత్స పొందుతున్న బాధితురాలు జూన్ 7న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య అధికారులు చెప్పారు. బిడ్డలో కూడా వైరస్ లక్షణాలు లేవని తెలిపారు.
మరోవైపు, తిరువనంతపురం జిల్లా నుంచి 19 శాంపిల్స్ ను టెస్టులు చేయగా వాటిల్లో 13 పాజిటివ్ కేసులని అనుమానిస్తున్నారు. దీంతో వీరందరి శాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపామని తెలిపారు.