మా పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదు: ములాయం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధమైనా తమ పొత్తు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కాదని ఎస్పీ, ఆర్జేడీ, ఎల్‌జేపీలు ప్రకటించాయి. తమది ఒక లౌకికవాద పార్టీల పొత్తుగా ఆయా పార్టీల అధినేతలు అభివర్ణించారు.

మూడు పార్టీలు కలిసే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని ప్రకటించిన అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాద్, ఎల్‌జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌లు ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతతత్వ శక్తులను ఎదుర్కొనడానికే తాము పొత్తుకు అంగీకరించామే తప్ప తమ పొత్తు కాంగ్రెస్‌కు ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే యూపీఏ కూటమి ప్రధాని అభ్యర్ధి మన్మోహన్ సింగేనని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్, సంజయ్‌దత్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా తాము పోరాడుతామని పేర్కొన్నారు. అలాగే తాము పేదలు, అణగారిన వర్గాలకోసం తాము పోరాడుతామని అన్నారు.

అదేసమయంలో తమ పార్టీల మధ్య కుదిరిన ఈ పొత్తు లోక్‌సభ ఎన్నికలవరకు మాత్రమే కాకుండా రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి