అర్జెంటీనాలో భారతీయ ఉత్సవాలు

FILE
అర్జెంటీనా ప్రజానీకాన్ని అలరించేందుకు భారతీయ చలనచిత్రాలు, వంటకాలు, సంప్రదాయ నృత్యాలు, హస్తకళల మేళవింపుతో జరిగే వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నవంబర్ 5వ తేదీన ప్రారంభం కానున్న ఈ వేడుకలు వరుసగా 11 రోజులపాటు అర్జెంటీనా వాసులకు కనువిందు చేయబోతున్నాయి.

ఈ సందర్భంగా అర్జెంటీనాలోని భారత రాయబారి ఆర్. విశ్వనాథన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. భారత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడుతాయని సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన 30 కంపెనీలు ఈ ప్రదర్శనలో నిలువనున్నాయనీ, హస్తకళల ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఇందులో ఉంటుందని ఆయన వివరించారు.

నవంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాలలో వివిధ భాషల చలన చిత్రాల ప్రదర్శనతో పాటు, భారతీయ సంప్రదాయ వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. అలాగే సంప్రదాయ నృత్యాలతోపాటు, హస్తకళలను సైతం ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు.

గత సంవత్సరం నిర్వహించిన ఈ వేడుకలకు వచ్చిన విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని.. ఈ భారతీయ ఉత్సవాన్ని పలు నగరాలకు సైతం విస్తరించాలని అర్జెంటీనా, భారతదేశ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా బ్యూనస్‌ఎయిరీస్‌లోనే కాకుండా మాంటివీడియో, సన్‌సియాన్, సిడాడ్ డి లెస్టీ నగరాలలో కూడా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కాగా.. గత ఏడాది అర్జెంటీనా రాజధాని నగరం బ్యూనస్ ఎయిరీస్‌లో మాత్రమే ఈ వేడుకలు జరిగాయి.

వెబ్దునియా పై చదవండి