ఆగని ఘోరాలు : మరో విద్యార్థిపై దాడి

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులకు అడ్డుకట్ట పడే మార్గమే కనిపించటం లేదు. తాజాగా మెల్‌బోర్న్‌లో రేషమ్ సింగ్ అనే 22 ఏళ్ల భారతీయ యువకుడిపై ఆరుగురు యువకులు దాడిచేసి చితకబాదారు. ఆరునెలల క్రితం పంజాబ్ నుంచి వచ్చిన సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును చేస్తున్నాడు.

దండె నాంగ్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో సింగ్ తలపాగా ధరించినందుకు దుండగులు దుర్భాషలాడారు. వెంటనే తలాపాగా తీసేయాలని ఆజ్ఞాపించారు. దీనికి రేషమ్ సింగ్ నిరాకరించటంతో, అతని తలపాగా తీసిన దుండగులు జుట్టు కత్తిరించేందుకు ప్రయత్నించారు.

దాడి అనంతరం రేషమ్ సింగ్ మాట్లాడుతూ... మొదటగా ఒక యువకుడు వచ్చి తనను దుర్భాషలాడి వెళ్లాడని చెప్పాడు. తరువాత అదే యువకుడు మరికొంతమందితో తిరిగివచ్చి, కత్తెరతో తన జుట్టు కత్తిరించేందుకు ప్రయత్నించారని అతను వాపోయాడు.

తాను ఆస్ట్రేలియాకు వచ్చేముదు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియదని రేషమ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇక్కడ పార్ట్‌టైం జాం దొరకటం కూడా కష్టంగా ఉందని చెప్పిన సింగ్... ఈ దేశంలో భారతీయులకు రక్షణ అనేదే లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఎన్నిరకాలుగా రక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతున్నా తమలాంటివారికి అందటం లేదని సింగ్ ఆరోపించాడు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో నెల రోజుల వ్యవధిలో ఇప్పటిదాకా సింగ్‌తో కలిపి 20మంది భారతీయులపై జాత్యహంకారులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో చాలామంది బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల్లో పడిపోగా, కొంతమంది స్వల్పగాయాలకు గురైన సంగతి తెలిసిందే...!!

వెబ్దునియా పై చదవండి