ఆసీస్‌పై భారతీయ విద్యార్థుల అనాసక్తి..!

FILE
ఆస్ట్రేలియాలో విద్యనభ్యసించడానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు విముఖత చూపుతున్నారు. దీంతో అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం సగానికి సగం తగ్గనుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ఇటీవలి జాత్యహంకార దాడులే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన "ఐడీపీ ఎడ్యుకేషన్" వ్యాఖ్యానించింది.

పదకొండు వందలమంది భారతీయ విద్యార్థులతో సహా మొత్తం ఎనిమిది దేశాలకు చెందిన ఆరువేల మంది విద్యార్థులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. భద్రతతోపాటు ఆర్థికమాంద్యం విద్యార్థుల తగ్గుదలకు కారణంగా నిలుస్తోందని ఐడీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ పొల్లాక్‌ను ఉంటంకిస్తూ "ఏబీసీ" వార్తా సంస్థ వెల్లడించింది. మాంద్యం నేపథ్యంలో విదేశీ విద్యపై భారత కుటుంబాలు ఆసక్తి చూపటంలేదని, అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గటమే ఇందుకు నిదర్శనమని పొల్లాక్ వివరించారు.

ఇదిలా ఉంటే.. విదేశీ విద్యకు సంబంధించి ఇంగ్లీషు మాట్లాడే ఇతర దేశాలకంటే ఆస్ట్రేలియానే తమకు అత్యంత సౌకర్యమని అధ్యయనంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయితే సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలు అత్యంత ప్రమాదకర ప్రాంతాలని సర్వేలో పాల్గొన్న మొత్తం విద్యార్థులందరూ అభిప్రాయపడటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి