భారత్ విద్యా కార్యక్రమాలకు "ఛార్లెస్ ట్రస్ట్" చేయూత

FILE
భారతదేశంలో విద్యా సహాయ కార్యక్రమాలకు సహాయం అందించే విషయానికి తాము కట్టుబడి ఉన్నామని.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ స్థాపించిన బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్ ప్రకటించింది. కాగా.. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఛార్లెస్‌ను కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

గ్రామీణ భారతదేశంలోని పేద విద్యార్థులు, యువకులు, మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలకు ఊతమివ్వాలని ఛార్లెస్ ట్రస్ట్ భావిస్తోంది. ముంబై, ఢిల్లీ, పూణె నగరాల్లో 2011 నాటికి ఏడు వేల మంది చిన్నారులకు ఈ ట్రస్ట్ చేయూతను ఇవ్వనుంది.

అలాగే.. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక మరియు బ్రిటన్‌లలో విద్యా సహాయాన్ని అందించాలని ఈ ఛార్లెస్ ట్రస్ట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... ముంబై, ఢిల్లీ, పూనేలలోని 500 సెంటర్లలో విద్యా సహాయ కార్యక్రమాలను నడుపుతున్న "ముంబై మొబైల్ క్రీచెస్"కు ఛార్లెస్ ట్రస్ట్ నిధులను అందిస్తోంది. అలాగే గుజరాత్‌లో "ట్రస్ట్ ఆర్ సాత్" అనే స్వచ్ఛంద సంస్థకు, గ్రామీణ మహిళల కోసం భారత్‌లోనే మొట్టమొదటిది అయిన సాతారాలోని "మాన్ దేసీ ఉద్యోగినీ బిజినెస్ స్కూల్"కు కూడా ఈ ట్రస్ట్ నిధులు సమకూరుస్తోంది.

వెబ్దునియా పై చదవండి