వీసా-ఫ్రీ జోన్ కావాలి: పాక్ హిందువులు, సిక్కులు..!!

PTI
బంధువులను, సన్నిహితులను కలుసుకునేందుకు వీలుగా భారతదేశం-పాకిస్తాన్ బోర్డర్ల మధ్య వీసా-ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సోమవారం పాకిస్థాన్‌కు చెందిన హిందూ, సిక్కు కుటుంబాలవారు ఇరు దేశాలకు విజ్ఞప్తి చేశాయి.

ఈ మేరకు పాకిస్తాన్ సిక్కు కౌన్సిల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రామేష్ సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వందలాది మంది హిందూ, సిక్కు కుటుంబాలకు చెందిన వ్యక్తులు తమను కలిసి తమ ప్రియతములను, సన్నిహితులను కలుసుకునేందుకు తరచుగా భారత్ వెళ్లాల్సి వస్తోందని చెప్పారన్నారు. అయితే వారు భారత్ పర్యటించాల్సిన ప్రతి సందర్భంలోనూ వీసా సమస్యలు తలెత్తుతున్నాయనీ.. అందుకే వీసా-ఫ్రీ జోన్‌ను ప్రకటిస్తే తమ సమస్యలు తీరుతాయని భావిస్తున్నట్లు తమతో చెప్పినట్లు సింగ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం స్వర్ణ దేవాలయంలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఆశ్రయం తీసుకుంటున్న 150 మంది హిందూ, సిక్కు కుటుంబాలకు చెందినవారికి రామేష్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగ్ మాట్లాడుతూ.. మెజారిటీ హిందూ, సిక్కు కుటుంబాలకు చెందినవారు పాక్‌లోని కరాచీలో స్థిరపడ్డారన్నారు. వీసా పొందేందుకు వీరు ఇస్లామాబాద్‌ రావాలంటే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. భారత్ పర్యాటక వీసాలను కేవల 15 రూపాయలకే పొందవచ్చుననీ.. అయితే వీరు కరాచీ నుంచి ఇస్లామాబాద్ చేరేందుకు రవాణా ఛార్జీలు, హోటల్, తిండి తదితర సౌకర్యాల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి వస్తోందని సింగ్ వివరించారు.

అదీ ఒకసారి పొందిన వీసాతో ఒకే ఒకసారి మాత్రమే భారత్‌లో పర్యటించే అవకాశం ఉంటుందనీ, రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు భారత్ వెళ్లేందుకు వీలు కుదరదని సింగ్ చెప్పారు. అందుకనే హిందూ, సిక్కు కుటుంబాలకు చెందిన మెజారిటీ ప్రజానీకం భారత్-పాక్ సరిహద్దులను వీసా-ఫ్రీ జోన్‌గా చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఇండో పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గర్లోగల అట్టారీ ప్రాంతం ఈ వీసా-ఫ్రీ జోన్‌కు అనుకూలంగా ఉంటుందని సింగ్ సూచిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి