వెలవెలబోతున్న హెచ్1బి వీసా అప్లికేషన్లు

FILE
హెచ్1బి వీసా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా అప్లికేషన్లు ఆశించిన స్థాయిలో అందలేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం వాపోతోంది. కాగా... 65 వేల హెచ్1బి వీసాలకు తలుపులు తెరచి ఇంతకాలమయినా ఆగస్టు 7వ తేదీదాకా వచ్చిన అప్లికేషన్లు కేవలం 49వేలుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. వృత్తి విద్యా నిపుణులు అమితంగా ఆసక్తిన ప్రదర్శించే హెచ్1బి వీసాలను అమెరికా ప్రభుత్వం ప్రతియేటా పరిమిత సంఖ్యలో విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ వీసాలపై ప్రత్యేక దృష్టిని కనబర్చే భారతీయులు ఈసారి అటువైపు ముఖం కూడా తిప్పి చూడటం లేదు. కౌంటర్లు తెరచిందే తడవుగా కుప్పులు తెప్పలుగా వచ్చిపడే దరఖాస్తులు సైతం ఆర్థికమాంద్యం కారణంగా నేడు వెలవెలబోతున్నాయి.

తాము ప్రకటించిన 65 వేల హెచ్1బి వీసాలలో ఇంకా 20 వేలు ఖాళీగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉందని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ప్రకటించింది. అయితే, ఎక్కువ సంఖ్యలో వీసాలు తిరస్కరణకు గురికావటం కూడా ఈ దుస్థికి కారణం కావచ్చునని యూఎస్‌సీఐఎస్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి