దాడులు ఆపకపోతే ఆస్ట్రేలియా వెళ్లనీయం: కృష్ణ

FILE
గత కొంతకాలంగా ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులు అలాగే కొనసాగినట్లయితే, పై చదువుల కోసం ఆ దేశం వెళ్లవద్దని, తమ విద్యార్థులకు సూచించే అవకాశం లేకపోలేదని విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ పేర్కొన్నారు.

ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానెల్‌తో ఎస్.ఎం. కృష్ణ మాట్లాడుతూ.. దాడుల నేపథ్యంలో ఇప్పటికే భారతీయ విద్యార్థులకు పలు సలహాలు, సూచనలను అందించామన్నారు. అయితే ఆస్ట్రేలియా వెళ్లవద్దని విద్యార్థులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లయితే, ఇక ఆ దేశంతో తమ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాగా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులపై జరుగుతున్న దాడులను వాస్తవ కోణంలో పరిశీలిస్తుందని తాము భావిస్తున్నామని కృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఆసీస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో కూడా దాడులు అలాగే కొనసాగుతుండటంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఆస్ట్రేలియాలో విద్యనభ్యసిస్తున్నారనీ, అయితే ప్రత్యేకించి భారతీయ విద్యార్థులపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని మంత్రి సూచించారు. లేకపోతే రెండు దేశాలకూ నష్టమైనప్పటికీ కఠినంగా వ్యవహరించేందుకు తాము ఎంతమాత్రం వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి