గత కొన్ని రోజులుగా భారత విద్యార్థులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న జాత్యహంకార దాడులపట్ల.. ఆ దేశ క్రికెట్ మాజీ సారథి స్టీవ్ వా ఆందోళన వ్యక్తం చేశాడు. భారతీయులపై జరిగిన దాడులు దురదృష్టకరమనీ, వాటిని ఆస్ట్రేలియన్లు ఎవరూ సమర్థించబోరని ఆయన వ్యాఖ్యానించాడు.
న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో స్టీవ్ వా మాట్లాడుతూ... ఒక తండ్రిగా తాను పిల్లల రక్షణను కోరుకుంటానని, భారతీయుల ప్రస్తుత పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలపట్ల తమ దేశ నాయకులు, ప్రజలు దిగ్ర్భాంతి చెందుతున్నారన్నారు. అయితే దేశంలో ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుటపడినట్లుగానే ఉందని స్టీవ్ వా చెప్పారు.
విద్యార్థుల రక్షణకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపట్ల స్టీవ్ వా సంతృప్తి వ్యక్తం చేస్తూ... దాడులు పునరావృతం కావన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కాగా... నెల రోజుల వ్యవధిలో 14 మంది భారత విద్యార్థులు ఆస్ట్రేలియాలో దాడులకు గురయిన సంగతి విదితమే.
ఇదిలా ఉంటే... "స్టీవ్ వా ఫౌండేషన్" పేరుతో ఆయన ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. తన చారిటీ కార్యక్రమాలపై హోంమంత్రి చిదంబరంను కలిసిన స్టీవ్ వా అనంతరం... విలేకర్లతో మాట్లాడుతూ బాధితులకు తన సానుభూతిని ప్రకటించడమేగాక, వారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.