దావోస్‌లో నోరూరిస్తున్న ఆంధ్ర రుచులు.. ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక పెవిలియన్
గురువారం, 24 జనవరి 2019 (20:20 IST)
ఆహా ఏమి రుచి తినరా మైమరచి... అని ఓ సినీ కవి వర్ణించినట్లు.. పసందైన ఆంధ్ర వంటకాలు... దావోస్‌లోనూ నోరూరిస్తున్నాయి. తెలుగు రుచులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమం ఇప్పడు ఖండాంతరాలు దాటి స్విర్జర్లాండ్ వరకు చేరింది. ప్రపంచ ఆర్థిక సదస్సు నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి అక్కడికి వెళ్లిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బృందంతో పాటు ప్రపంచదేశాల ప్రతినిధులను కూడా ఆంధ్ర ఆహారం కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు.
దావోస్‌లోని ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ఈ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయగా ప్రత్యేకించి వివిధ దేశాలవారు తెలుగు రుచులను ఆస్వాదిస్తూ, తయారీ విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం విశేషం. గత కొంతకాలంగా పర్యాటక శాఖ తెలుగువారికే పరిమితమైన ఆంధ్ర ఆహారాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో ప్రత్యేకించి ఆహార పండుగలను నిర్వహిస్తూ ఉండగా, ఇదే క్రమంలో విశాఖపట్నం మ్యారియట్ సహకారంతో దావోస్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్ర వంటకాల విందు తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచింది.
రుచితో పాటు పోషక విలువలపరంగానూ ఆంధ్రప్రదేశ్ ఆహారానికి ఎంతో విలువ ఉండగా గత కొంతకాలంగా ఇవి కనుమరుగైపోతుండటంతో పర్యాటక శాఖ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా ఈ సందర్భంగా తెలిపారు.
పాత తరంలో అంతరించిపోయిన సంప్రదాయ వంటకాలను ఈ తరానికి తెలియజెప్పేందుకు పర్యాటకశాఖ కృషి చేస్తుందని ఆ క్రమంలోనే అంతర్జాతీయ వేదికపై కూడా తెలుగు రుచుల ప్రాధాన్యతను ప్రత్యక్షంగా వివరించే ప్రయత్నం చేసామన్నారు. వాస్తవానికి ఆంధ్ర భోజనానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రుచుల కమ్మదనానికి ఎవరైనా లొట్టలేసుకోవాల్సిందే. తెలుగు వంటకాలకు అంత శక్తి ఉంది. దావోస్‌లో ఆంధ్ర భోజనాన్ని రుచిచూసిన ఓ విదేశీ ఉన్నతాధికారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ఆంధ్ర భోజనం సూపర్‌గా ఉందంటూ కితాబునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పరంగా ఈ తరహా కార్యక్రమాన్ని తీసుకోవటం పట్ల వారు ప్రశంశలు అందించారు. ఈ నేపధ్యంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు దీర్ఘదృష్టి నేపధ్యంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా తమ శాఖ ఆంధ్ర రుచులను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమానికి పూనుకుందన్నారు.
ఇకపై విదేశాలలో జరిగే ప్రతి అంతర్జాతీయ సదస్సులోనూ ఆంధ్ర రుచుల స్టాల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. దావోస్‌లోని ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన ఆహారంకు ఊహించని స్పందన వచ్చిందని, పరాయి దేశం వచ్చినా పసందైన తెలుగు ఆహారం లభించటం పట్ల రాష్ట్ర ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసారని ఈ సందర్భంగా మీనా వివరించారు.