యోగా, భారతీయ నృత్యం, శ్లోకాలు, ఇలా ఎన్నో మన సంస్కృతికి సంబంధించిన అంశాలు సాయి దత్త పీఠం గురుకులంలో బోధిస్తూ వస్తోంది. వార్షికోత్సవం నాడు చిన్నారులు వేదికపై తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించడం గత నాలుగేళ్లుగా ఆనవాయితీగా చేస్తున్నారు. నాల్గవ వార్షికోత్సవం నాడు కూడా ఐదు నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఐదు నుంచి ఏడేళ్ల లోపు చిన్నారులు యోగా, భజనలు, శ్లోకాలు, జయహో అంటూ చేసిన నృత్యానికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనలు చూసి తన్మయులయ్యారు. రెండో చిన్నారుల బృందం కూడా ఆధ్యాత్మిక ప్రదర్శనలు, యోగాలో వివిధ ఆసనాలను ఒక క్రమ పద్దతిలో వేసిన ఔరా అనిపించింది.
మూడో బృందం విష్ణు సహాస్ర నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జపం చేసిన తీరు ఆకట్టుకుంది. యోగా ఆసనాలతో నృత్యంతో మేళవింపు చేసి.. చేసిన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. ఐకమత్యమే మహాబలం అనే సందేశాన్ని చాటుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనకు కరతాళ ధ్వనులతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అందరు చిన్నారులు మహాలక్ష్మి అష్టకాన్ని అద్భుతంగా పఠించారు.
న్యూ జెర్సీ వాసులైన సంస్కృత ప్రొఫెసర్ & స్కాలర్ రాజారావు బండారు, నాట్స్ గత అధ్యక్షులు, డైరెక్టర్ మోహన కృష్ణ మన్నవ, ఫౌండర్ అండ్ సీఈఓ క్యూరీ లెర్నింగ్ సెంటర్, రత్న శేఖర్ మూల్పూరులను సాయిదత్త పీఠం దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎడిసన్ బావార్చి వారు అందించిన స్నాక్స్ మరియు డిన్నర్ అందరి మన్నలను పొందింది. తదుపరి గురుకులం సెప్టెంబర్ నుండి మొదలు కానుంది. వివరాలకు సాయిదత్త పీఠంలో సంప్రదించవచ్చు.