దాడులు ఆపకపోతే తీవ్ర పర్యవసానాలే: సుజాతా సింగ్

FILE
భారతీయులపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతే, ముందుముందు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని.. ఆస్ట్రేలియాలోని భారత హై కమీషనర్ సుజాతా సింగ్ హెచ్చరించారు. ఆసీస్ గవర్నర్ క్వింటెన్ బ్రైసీని కలుసుకున్న సుజాత భారతీయులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు చేస్తున్న కృషిని ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని వివరించి చెప్పారు.

ఈ సందర్భంగా సుజాతా సింగ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా జాత్యహంకార దేశం కాదనీ, అయితే భారతీయులపై జరుగుతున్న దాడులను నివారించే దిశగా ఆ దేశం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ విషయంలో విక్టోరియా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె ఘాటుగా విమర్శించారు.

భారతీయులకు వ్యతిరేకంగా వందకుపైగానే జాత్యహంకారపూరిత హింసాత్మక ఘటనలు జరిగినా, సమస్య తీవ్రతను గుర్తించకుండా విక్టోరియా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోందని సుజాతా సింగ్ దుయ్యబట్టారు. దాడులపై చర్యలు తీసుకునేందుకు ఆ ప్రభుత్వం విముఖత చూపుతోందని ఆమె ఆరోపించారు.

దాడుల విషయంలో విక్టోరియా పోలీసుల తీరు గర్హనీయమనీ, కొన్ని సందర్భాలలో బాధితుల జాతిని నమోదు చేసేందుకు కూడా వారు నిరాకరిస్తున్నారని సుజాతా సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా.. సుజాతా సింగ్ చేసిన పై వ్యాఖ్యలను ది ఏజ్ పత్రిక ఓ కథనంలో ప్రచురించింది. అయితే మరోసారి సుజాతను కలుసుకుని, తాము చేయగలిగినదంతా చేస్తున్నామని భరోసా ఇస్తామని విక్టోరియా ప్రధాని పేర్కొనడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి