భారత పర్యావరణ సేవకురాలికి "సిడ్నీ" శాంతి బహుమతి

PTI
భారత పర్యావరణ సేవకురాలు మరియు భౌతిక శాస్త్రవేత్త వందనా శివ.. 2010 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక "సిడ్నీ శాంతి బహుమతి"కి ఎంపికయ్యారు. మహిళా సాధికారతకు, పర్యావరణ పరిరక్షణ కోసం భౌతిక శాస్త్ర తోడ్పాటుతో వందన చేస్తున్న కృషికిగానూ ఈ పురస్కారం లభించింది.

కాగా.. 57 సంవత్సరాల వందనా శివ భౌతిక శాస్త్ర అధ్యయనంలో విశేషమైన ఖ్యాతిని ఆర్జించారు. భౌతిక శాస్త్రంలో తనకున్న అనుభవంతో పర్యావరణ పరిరక్షణకు ఆమె నడుం బిగించారు. అంతేగాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల సాధికారత కోసం, అణగారిన వర్గాల కోసం వందన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

సిడ్నీ శాంతి బహుమతిని అందుకోబోయే ముందుగా వందన నవంబర్ 3వ తేదీన పర్యావరణంపై ఓ ఉపన్యాసం ఇవ్వనున్నారనీ, అనంతరం నవంబర్ 4వ తేదీన అవార్డును అందుకోనున్నారని ఆస్ట్రేలియన్ న్యూస్ ఏజెన్సీ ఏఏపీ ఓ కథనంలో వెల్లడించింది.

సిడ్నీ శాంతి బహుమతి తనకు ప్రకటించటంపై సంతోషం వ్యక్తం చేసిన వందనా శివ న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన ప్రసంగంలో మహిళా రైతుల గురించి ప్రస్తావించనున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిస్థితులపై ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులపై కూడా తన ప్రసంగంలో వ్యాఖ్యానించనున్నట్లు వందన వివరించారు.

వెబ్దునియా పై చదవండి