బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో తమ క్రీడాకారులు మెరుగ్గా రాణించికపోతే వారికి ఇచ్చే నగదు మొత్తంలో కోత విధిస్తామని బ్రిటన్ హెచ్చరించింది. చైనా విశ్వ క్రీడల్లో రాణించడమే కాకుండా పతాకాలు గెలుచుకురావాలని తమ క్రీడాకారులకు బ్రిటన్ సూచించింది. తమ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో 41 పతాకాలు గెలవాలని బ్రిటన్ క్రీడల శాఖ మంత్రి జెర్రీ సట్‌క్లిఫ్ చెప్పారు.
బ్రిటన్ అథ్లెట్లు తాము సూచించిన విధంగా రాణించకపోతే నగదులో కోత ఉంటుందని సట్‌క్లిఫ్ హెచ్చరించారు. బ్రిటన్ క్రీడాకారులు మెరుగ్గా రాణించి తమ దేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు. విశ్వ క్రీడల్లో తమ క్రీడాకారుల శిక్షణ, ఇతర అవసరాల కోసం 500 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసినపుడు దానికి తగిన రాబడిని ఆశించటంలో తప్పులేదని సట్‌క్లిఫ్ వెల్లడించారు.