సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానమాచరించాలి. కొత్త దుస్తులను ధరించి సూర్యనారాయణుడిని స్మరించుకోవాలి. ముఖ్యంగా ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి పారాయణం చేయాలి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఈ రోజు రవి సంక్రమణ పుణ్యకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం, సూర్యానారాయణస్వామి వ్రతం ఆచరిస్తే భక్తులకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కి సకల కోర్కెలూ నెరవేరతాయి.
ఉదయం 7.30 నుంచి 9గంటల సమయంలో ఈ వ్రతాలను ఆచరించడం వల్ల శుభాలు కలుగుతాయి. అందుకే ఈ పెద్ద పండుగ రోజున గోదానం, భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పూఉప్పూ, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు వస్తాయి. ఈ రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభించి శుభాలు కలుగుతాయి.
సంక్రాంతి రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం, గడపకు పసుపు, కుంకుమ పెట్టడం, గుమ్మంలో ముగ్గులు వేయడం, ఇంట్లో రకరకాల పిండివంటలు చేయడం, బెల్లం పరమాన్నంచేసి సూర్యభగవానుడికి పెట్టడం వల్ల ఆ ఇంటికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
కనుమను పశువుల పండుగ అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన ఫలసాయాన్ని కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్ష్యాదులకూ భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే పంటల వృద్ధి జరిగిందనడానికి గుర్తుగా కనుమ పండుగను వైభవంగా జరుపుతారు. ఈ రోజు పశువులకు, పక్షులకు ఆహారం అందిస్తారు. గోవులకు పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తారు. తద్వారా ఆరోజు అవి సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలా చేయడం వల్ల వాటికి మనుషులపై ప్రేమ కలిగి అందరికీ శుభాలు చేకూరతాయన్నది ఓ విశ్వాసం.
కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటారు. కనుమ రోజు కచ్చితంగా తలస్నానమాచరించి సూర్యభగవానుడిని పూజించడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఇంటి బయట రథం ముగ్గు వేసి సూర్య భగవానుడి రథాల గుర్తుగా దాన్ని భావిస్తారు. కనుమ రోజు గారెలు వేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం సంప్రదాయం.