సంక్రాంతి వేడుకలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగులు తెలుగునాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. సంక్రాంతి పర్వదినాల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ వేళ తెలుగు లోగిళ్లు అలనాటి అనుభూతులకు వేదికలుగా మారుతాయన్నారు. ప్రత్యేకించి గ్రామసీమలలో నెలకొనే సందడి అనిర్వచనీయమన్నారు. ధాన్యసిరులు, సిరిసంపదలతో రైతులు జరుపుకునే సంక్రాంతి వేడుక తెలుగు వారి సంప్రదాయాలలో ముఖ్యమైన స్ధానాన్ని ఆక్రమించిందన్నారు.
ఈ శుభసందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం ఆవశ్యకతను, ఆలోచనలను ప్రేరేపిస్తుందని గవర్నర్ తెలిపారు. ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులాటలు, పతంగుల సందళ్ళు, భోగి మంటలు, పిండివంటలు, పశు ప్రదర్శనలు గ్రామాల్లో సంక్రాంతి శోభను ఇనుమడింపచేస్తాయని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.