తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సంఘాల్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో స్పష్టం చేశారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశారు. ఇక శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని ఈవో తేల్చి చెప్పేశారు. ఇకపోతే.. శ్రీవారు కొలువైన తిరుమలలో ఈ నెలలో ఈ నెలలో ఓ అరుదైన దృశ్యం సాక్షాత్కారం కానుంది.
గరుడ పంచమి నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల మధ్య, ఆపై శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య గరుడవాహన సేవను నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెలలో జరిగే రెండు గరుడ సేవలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానుండటంతో వారి సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు.