సాధారణంగా ఆదివారం ప్రతి ఒక్కరూ హాలిడే మూడ్‌లో ఉంటారు. అయితే, పంచాంగంలో ఆదివారం కూడా అనేక నియమనిబంధనలు పాటించవచ్చని బ్రహ్మణోత్తములు చెపుతున్నారు. ఆదివారం అనే పదం ఆదిత్యవారం నుండి పుట్టినదని సాహిత్య నిరూపణము. సంస్కృతమున భానూవారంగా పిలువబడుతుంది. ఇంకా చెప్పాలంటే భారతదేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్ గా ఇప్పటికీ పిలుస్తున్నారు.
వారంలో మెుదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించవలసిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే, ఆదివారం ఉదయాన్నే సూర్యస్తోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. సూర్యస్తోత్రం తరువాత ఆలయ దర్శనం గావించి ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు.
ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని చెబుతున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరిచేరుతాయి. గోధుమలతో తయారు చేసే వంటకాలు చపాతీ, పూరీ వగైరాలను ఆదివారం రోజున భుజిస్తే ఆరోగ్యదాయకమని శాస్త్రకర్తలు తెలియజేయుచున్నారు.