రోజులో అధికభాగం ఆఫీసులో గడుపుతాం. ఆఫీసులో ఎవరి పని వారిదే అయినా ఒకరి పనికి మరొకరి పనితో సంబంధం ఉంటుంది. తోటివారితో కలిసి పనిచేయడం కుదరకపోతే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆఫీసులో అందరితో ఒక మోస్తరు ఫ్రెండ్లీగా ఉండాలి. పూసుకుని తిరగకపోయినా, కనిపించినపుడు చిరునవ్వుతో పలుకరించడం అవసరం.
ఆఫీసులో అందరి సమర్థత ఒకేలా ఉండదు. మీకన్నా తక్కువ సమర్థతతో పనిచేసే వారిని ఆటపట్టించడం, మీకన్నా బాగా పనిచేసే వారిని చూసి కుళ్లుకోవడం... రెండూ తప్పే. కొంచెం సహనం అలవర్చుకోవాలి. అవతలి వారి తప్పులను వెనువెంటనే ఎత్తిచూపి, విమర్శించవద్దు. ఇతరుల గురించి మీరు కొంత సమాచారం తెలిస్తే దానిని మీతోనే ఉంచుకోండి.
అనవసరంగా దానికి ప్రచారం కల్పిస్తే రేపు మీమీద అటువంటి నీలివార్తలే సృష్టించే ప్రమాదముంటుంది. బాగా పనిచేసినవారిని అభినందించడం, నలుగురిలో మెచ్చుకోవడం చేయాలి.