సానుకూల భావాలు ఒత్తిళ్లను జయిస్తాయి

శనివారం, 4 అక్టోబరు 2008 (19:34 IST)
FileFILE
మానసిక శాంతి కావాలని కోరుకునేవారు ఈ రోజుల్లో రానురాను ఎక్కువవుతున్నారు. ఈ ఆలోచన ప్రస్తుతం ఉన్నంతగా ఇంతకు ముందు ఎన్నడూ లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక కాలంలో ఏర్పడుతున్న ఆందోళనలు, పోటీ వాతావరణం కారణంగా అన్ని రంగాల్లో ఒత్తిళ్లు, విపరీతమైన స్వార్థపరత్వం వంటివి మనుషుల మానసిక ప్రపంచాన్ని కుదిపి పారేస్తున్నాయి.

ఈ ఒత్తిళ్లు, ఆదుర్దాలు, ఆందోళనలు, ఆగ్రహావేశాలు వంటివి కుటుంబంలో తరాల అంతరాలు లేకుండా అందరిలోనూ వ్యాపిస్తున్న నేపథ్యంలో మనసు ప్రశాంతతకోసం పరితపిస్తోంది. అందుకే మానసికారోగ్యం అనేది ఈ రోజు అన్ని సమస్యల కన్నా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యానికి ఇచ్చిన నిర్వచనం చూడండి.. శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా మనిషి సత్ప్రవర్తనను కలిగి ఉండటం. ఈ నిర్వచనానికి తాజాగా కొందరు పరిశోధకులు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా చేర్చారనుకోండి. వ్యక్తి ఆలోచనలు, దృక్పధాలు, అభిప్రాయాలు, చర్యలు వంటి విషయాలన్నింటికి సంబంధించిన ఆరోగ్యమే మానసిక ఆరోగ్యం అనబడుతుంది.

అనుకూల దృక్పథం కలిగి ఉండటం అన్నిటికంటే మించి మానసికారోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యుల భావన. మన పట్ల మనం అనుకూల దృక్పధం ఏర్పర్చుకోవాలనుకుంటే కింది కొన్ని సూత్రాలను అనుసరించాలి.

మొదటిది. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. అనుకూల అభిప్రాయం కలిగి ఉండటం.

మిమ్మలను మీరు ప్రయోజకత్వం కలిగిన మనిషిగా పరిగణించుకోవడం. ప్రపంచంలో మీరు వేరెవరితోనూ పోల్చగలిగిన వారు కాదని గుర్తుంచుకోండి. మీ ప్రత్యేకత మీది. దాన్ని ఎవరూ తీసుకోలేరు.

మనుషులు నూటికి నూరు శాతం మంచివారు గాను లేదా చెడ్డవారు గాను ఉండరని గుర్తుంచుకోండి. ఇదే తప్పొప్పుల పట్ల సానుకూల భావానికి కీలకమైన అంశం.

మీరు ఏ రంగంలో రాణించగలరో ఆ రంగంపైనే దృష్టి పెట్టి పనిచేయడం సాగించండి. ఆ దిశగానే మీ కృషిని విస్తృత పరిస్తే అవే మీకు భవిష్యత్తులో విలువైన ఆస్తులు కాగలవు. ఇష్టంలేని, చేతకాని పనులు మొదలు పెట్టి ఇరుక్కోవడం ఆందోళనను, ఒత్తిడిని మాత్రమే ఆస్తిగా తెచ్చిపెడతాయి.

మీకు అంతమంచిగా ఇష్టం కాని పనులను కూడా కనుక్కోవాలి. ఇష్టం కాని వాటి పట్ల కూడా కృషి చేయటం ప్రారంభిస్తే ఆసక్తి లేని పనులు సైతం మీ విశ్వాసాన్ని పెంచవచ్చు.

ద్వేషం, అసూయ, కోపం, మీమీద మీరే సానుభూతి ఏర్పడటం వంటి భావాలను పెంచి పోషించడం కోసం అనవసరంగా శక్తిని వృధా చేయవద్దు.

అలాగే పరనింద కోసం వృధాపరిచే శక్తిని, సమయాన్ని మీకు ప్రయోజనం కలిగించే ఏదైనా పనిని మెరుగు పర్చుకోవడానికి మళ్లించండి. పరనింద ఎందుకూ కొరగాదని గుర్తించండి.

మీరు మీ అభిప్రాయాలకు విలువివ్వండి. అదే విధంగా ఇతరుల అభిప్రాయాలను కూడా మన్నించండి అప్పుడే అవి ఆరోగ్యకరమైన అభిప్రాయాలవుతాయి.

వెబ్దునియా పై చదవండి