ఒక్కసారిగా ఒంటరినయ్యా... 20యేళ్లలో పెళ్లి వద్దనుకున్నా... 50లో చేసుకోవాలని ఉంది...?

వరుణ్

మంగళవారం, 9 జులై 2024 (12:09 IST)
తల్లిదండ్రులు భౌతికంగా దూరం కావడంతో ఇపుడు ఒంటరినయ్యాను. నా వయసు 50 యేళ్ళు. తల్లిదండ్రులు ఉన్న సమయంలో అంటే 20 యేళ్ళు వున్నపుడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాను. ఉద్యోగం చేస్తూ... జీవితాన్ని ఆస్వాదించా. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఏడాదిక్రితం తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. బంధుమిత్రులు వారి వారి జీవితాల్లో బిజీ. ఒక్కసారిగా ఒంటరినయ్యా అనిపిస్తోంది. మిగిలిన జీవితం ఎలా గడపాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.
 
సమాజంలో చాలామంది వాళ్ల వాళ్ల కట్టుబాట్లను అనుసరించి వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. అయితే, కొంతమంది తల్లిదండ్రులను చూసుకోవడం కోసమో, కెరియర్ మీద మరింత శ్రద్ధ పెట్టాలనో, లేదా కొన్ని భయాలూ, అపోహల వల్లనో పెళ్లి గురించి ఆలోచించరు. వయసులో ఉన్నప్పుడు వాళ్లకు ఎటువంటి అభద్రతాభావాలూ ఉండవు. స్నేహితులూ, బంధువులూ, వారి పిల్లలతో సమయం గడిచిపోతుంటుంది. కానీ, ఇలా ఆకస్మికంగా తల్లిదండ్రులు దూరమయ్యాక వారిలో అభద్రతాభావం పెరుగుతుంది. 
 
మీ మీద ప్రేమ ఉన్నా కూడా మిగతా కుటుంబ సభ్యులు వాళ్ల బాధ్యతల్లో పడిపోయి సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు ఒంటరినయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే, మీరు మొదటినుంచీ పెళ్లిచేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి, మీకు అప్పటినుంచీ పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడం వంటి అలవాట్లు ఉంటే, అవి మీకు ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి. 
 
ఒకవేళ అలాంటివేవీ లేకుంటే మీరు మెడికల్ క్యాంపులూ, వరద బాధితులకు సాయం చేసే సేవా సంస్థల్లో వాలంటీర్గానూ చేరొచ్చు. అనాథాశ్రమాల్లోని వారికి సేవలందించొచ్చు. వీటితోపాటు సమయం కుదుర్చుకొని మీ బంధుమిత్రులతోనూ సమయం గడపండి. వీటన్నింటి వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఒంటరితనం పోయి, ఉల్లాసంగానూ, ఆత్మసంతృప్తితోనూ ఉండగలుగుతారు. కొత్త ఆశలు చిగురించి, మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు