రాత్రి 10 గంటల తరువాతే సృజనాత్మకత..!!

మంగళవారం, 21 అక్టోబరు 2008 (17:29 IST)
FileFILE
రాత్రి 10.04 నిమిషాల సమయంలో.. ప్రతి మనిషిలోనూ బ్రహ్మాండమైన ఆలోచనలు కలగడటమే గాకుండా, సృజనాత్మకత వెల్లి విరుస్తుందని ఓ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. మనిషి రోజువారీ ఆలోచనల తీరుతెన్నులపై పరిశోధనలు జరిపిన ఇటలీకి చెందిన కేథలిక్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనిపెట్టారు.

వివరాల్లోకెళ్తే... రోజులో సృజనాత్మక శక్తి పూర్తిగా క్షీణ దశకు చేరుకునే సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలుగా గుర్తించినట్లు కేథలిక్ పరిశోధకులు చెబుతున్నారు. ఇకపోతే రోజువారీ అద్భుతమైన ఆలోచనలు మెదడులో కలిగినప్పుడు వాటిని రాసి పెట్టుకోవడంలో పురుషుల కంటే మహిళలే మెరుగ్గా ఉంటారని కనుగొన్నట్లు వారు పేర్కొన్నారు.

పైన మనం చెప్పుకున్న సంగతులన్నీ మంచి వాటి గురించే... కానీ అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్కువ మంది కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతారనీ, ఇలాంటి ఆలోచనలన్నీ ఆ సమయంలోనే ఎక్కువగా కలుగుతుంటాయని కూడా పై పరిశోధకులు వెల్లడించారు.

వీరి అధ్యయనం ప్రకారం... పరిశోధించిన వారిలో 98 శాతం మంది మధ్యాహ్న సమయంలో చురుకుదనాన్ని కోల్పోతున్నట్లు అభిప్రాయపడినట్లు తెలిపారు. శుభ్రంగా స్నానం చేయటం ద్వారా చురుకుదనాన్ని మెరుగుపరచుకుంటామని మరో 44 శాతం మంది చెప్పినట్లు కేథలిక్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రకటించారు.

రాత్రి 10 తరువాత ప్రతి ఒక్కరిలో కొత్త, కొత్త బ్రహ్మాండమైన ఆలోచనలు కలగటమేగాకుండా, మంచి సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అదే విధంగా అర్థరాత్రి తరువాత వచ్చే ఆలోచనలను ఏ మాత్రం మీ మనసుల్లో నిలవనీయకండి. వాటిని మీ మనసులోకి రానీయకుండా జాగ్రత్త పడుతారు కదూ...!

వెబ్దునియా పై చదవండి