నేను దేవుణ్ణి... మరియు మీరు కూడా దేవుళ్లే: సత్యసాయి

Venkateswara Rao. I

సోమవారం, 25 ఏప్రియల్ 2011 (18:20 IST)
ఒక శివలింగం.. ఆయన చేతిలోంచి ప్రత్యేకంగా పుట్టుకొస్తూంటుంది. ప్రతిరోజు ఆయన విభూతిని గాల్లోంచి సృష్టిస్తుంటారు... లిప్తపాటు కాలంలో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తూ ఎన్నో మరెన్నో అద్భుతాలను సృష్టించే బాబా శరీరాన్ని వీడి వెళ్లిపోయారు. ఎన్నో ఆరిపోయే దీపాలకు వెలుగు చూపిన సత్యసాయి వెలుగులో వెలుగుగా కలసిపోయి అంతర్థానమయ్యారు.
WD


ప్రశాంతి నిలయంలో వెలసిన సత్యసాయి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం పుట్టపర్తి. భగవాన్ సత్యసాయిబాబా మహిమ కారణంగా ఈ చిన్ని గ్రామం జాతీయ, అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది. సాయిబాబా పట్ల మొక్కవోని భక్తిప్రపత్తులు గల భక్తులు ఇక్కడ సాయిబాబా ఆశ్రమాన్ని నిర్మించారు. దీనికే ప్రశాంతి నిలయం అని పేరు. అంటే శాంతికి నిలయం అని అర్థం

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన తీర్థయాత్రా స్థలాల్లో పుట్టపర్తి ఒకటి. మహనీయుడైన సాయిబాబాను దర్శించి ఆయన ఆశీస్సులు అందుకోవాలనే తలంపుతో ప్రపంచం నలుమూలలనుంచి ఈ చిన్న గ్రామానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఒకానొకప్పుడు ఊరూ పేరూ లేనట్లుగా ఉన్న చిన్ని గ్రామమైన పుట్టపర్తి ఈ రోజు విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది.

సత్యసాయి బోధనలు
జీవితానికి సంబంధించిన మూల సూత్రాల ఆధారంగా సత్యసాయి బోధనలు కొనసాగేవి. అవి సత్యం, సత్ప్రవర్తన, శాంతి, విశ్వజనీన ప్రేమ, అహింస అనే మూలసూత్రాలనే ఆయన నిత్యం ప్రవచించేవారు. ఆశ్రమంలో విద్యాసంస్థలు, మ్యూజియం. నక్షత్రశాల తదితర దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ప్రతి ఏటా నవంబర్ 23న ప్రశాంతి నిలయం అద్భుతంగా అలంకరించబడుతూ ఉంటుంది. ఆరోజు సాయిబాబా జన్మదినం మరి.

భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నేతలు, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి, క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, గవాస్కర్, వ్యాపార దిగ్గజాలు టాటా, అంబానీ కుటుంబాలే కాక ఎంతోమంది సెలెబ్రిటీలు బాబాను దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు.

సాయిబాబా 85వ జన్మదినం సందర్భంగా ప్రశాంతి నిలయానికి 15 లక్షల మంది భక్తులు విచ్చేశారని అంచనా. భారత్ నుంచి, ప్రపంచంలోని 180 దేశాల నుంచి 15 వేలమంది ప్రతినిధులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారట.

సత్యం.. శివం.. సుందరం..!!
సత్య సాయిబాబా చాలావరకు ప్రశాంతి నిలయంలోని తన ప్రధాన ఆశ్రమంలో ఉండేవారు. దేశంలో ఆయనకు మూడు ప్రధాన మందిరాలు ఉన్నాయి. ముంబైలోని తొలి కేంద్రాన్ని ధర్మక్షేత్ర లేదా సత్యం అని పిలుస్తుంటారు. హైదరాబాద్‌లో ఉన్న రెండో కేంద్రం శివం అని చెప్పబడుతుంది. చెన్నయ్‌లో ఉన్న మూడవ కేంద్రం సుందరంగా పిలవబడుతోంది. సుందరం కేంద్రం భజన బృందాలకు ప్రసిద్ధి గాంచింది.

వీరు ఇంతవరకు 54 క్యాసెట్లు, సిడిలలో పాటలను విడుదల చేశారు. 54వ క్యాసెట్‌లో సాక్షాత్తూ సాయిబాబాయే పాటలు పాడటం గమనార్హం. సాయిబాబా పలు ఉచిత విద్యా సంస్థలను, ధర్మసంస్థలను, సేవా ప్రాజెక్టులను నెలకొల్పారు. ప్రపంచమంతటా 166 దేశాల్లోని 10వేల కేంద్రాలలో ఇవి వ్యాపించి ఉన్నాయి.

సాయి నిత్య కార్యకమం సాగేదిలా...
సాయి బాబా ఆశ్రమంలో ఉదయం పూట ఓంకార మంత్రాన్ని జపిస్తూ, సుప్రభాతం పఠించడం ద్వారా రోజువారీ కార్యక్రమం మొదలయ్యేది. తర్వాత వేదపారాయణం, నగర సంకీర్తన - ప్రభాత భక్తిగీతాలు మొదలయ్యేవి. రోజూ రెండు సార్లు భజన కార్యక్రమాల తర్వాత సాయిబాబా తన భక్తులకు దర్శనమిచ్చేవారు.

దర్శన సమయంలో సాయిబాబా తన శిష్యులు, అనుచరుల మధ్య తిరుగాడుతుండేవారు. చాలా సార్లు ఆయన భక్తులతో సంభాషించేవారు. విన్నపాలు తీసుకునేవారు. విభూతిని సృష్టించి పంచేవారు. లేదా వ్యక్తులను, బృందాలను ఇంటర్వ్యూలకు పిలిచి మాట్లాడేవారు. ఇంటర్వ్యూలు పూర్తిగా బాబా అభీష్టం మేరకే ఎంపిక చేయబడేవి.

నేను దేవుణ్ణి... మీరూ దేవుళ్లే...
WD

బాబా ఇంటర్వ్యూ పొందగలగడం మహా భాగ్యమమని భక్తులు నమ్మేవారు. ఒక్కోసారి ఒకే వ్యక్తి, గ్రూపు లేదా కుటుంబం ప్రయివేటు ఇంటర్వ్యూలకు ఆహ్వానితులయ్యేవారు. అలాంటి ఇంటర్వ్యూలను పొందగలిగే వారు సాయిబాబా తమ జీవితాల గురించే ప్రస్తావించడం చూసి ఆశ్చర్యపోయేవారు.

తన దర్శనమాత్రంతో పలు ఆధ్యాత్మక ప్రయోజనాలు కలుగుతాయని సాయిబాబా చెప్పేవారు. సాధారణంగా హిందువులు సన్యాసులు, గురువులు గురించి ఇదేవిధమైన విశ్వాసాలను కలిగి ఉంటారు.

బాబా ఉనికి, దివ్యత్వం గురించి ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడల్లా భగవాన్ ఇలానే చెప్పేవారు "నేనే దేవుణ్ణి. మరియు మీరు కూడా దేవుళ్లే... మీకూ నాకు తేడా ఎక్కడ ఉందంటే నాకు ఈ విషయం తెలుసు, మీరు పూర్తిగా ఈ విషయం తెలుసుకోలేరు...". అదే బాబా దివ్యత్వం. అందుకే నేడు ప్రపంచం ఆయనను దేవుడిగా కొలుస్తోంది. బాబా దేహాన్ని వీడినా భక్తుల హృదయాల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటారు.