పుట్టపర్తి సత్యసాయి వాక్కులు

WD
సత్యసాయి తన వద్దకు వచ్చిన భక్తులతో ఇలా అంటారు. "నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు. మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు.

నేనేదో మహిమలు చేస్తున్నాననీ, ఇదీ అదీ సృష్టించి ఇస్తున్నాననీ విని ఉంటారు. అది ముఖ్యం కాదు. సత్వ గుణమే ముఖ్యం. మీకు నేను ఆరోగ్యైశ్వర్యాదులను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే".

తన దర్శనం అనంతరం భక్తులను ఇలా చేయమని బాబా చెపుతారు. "నా దర్శనం తరువాత ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొనండి. ఆ ప్రశాంతతలో నా ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. మీ ప్రక్కనుండి నేను నడచినపుడు నా శక్తి మిమ్ములను చేరుతుంది. వెంటనే గనుక మీరు ఇతరులతో మాట్లాడడం మొదలుపెడితే ఆ శక్తి మీకు ఉపయోగం కాకుండా చెల్లాచెదరు కావచ్చును.

నా కంటపడిందేదైనా నిస్సంశయంగా చైతన్యవంతమౌతుంది. రోజు రోజుకూ మీలో మార్పులు సంభవిస్తాయి. మీ మధ్యలో నడవడం అనేది దేవతలు సైతం కోరుకునే సుకృతం. అది నిరంతరం ఇక్కడ మీకు లభిస్తున్నది. అందుకు కృతజ్ఞులు కండి"- అని సత్యసాయి బాబా తన భక్తులకు చెపుతారు. ఈ నెల 23వ తేదీన సాయిబాబా తన జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి