పుట్టపర్తిలో వైభవంగా ముగిసిన విశ్వశాంతి యాగం

పుట్టపర్తిలో మూడు రోజుల పాటు వైభవంగా జరిగిన సహస్ర పూర్ణ చంద్ర దర్శన విశ్వశాంతి యాగం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. నవరత్నాధి పుష్పాలను సత్యసాయిబాబా హోమగుండానికి అర్పించిన పిదప పూర్ణాహుతితో ఘనంగా ఈ యజ్ఞం పూర్తయింది.

అంతకుముందు.. హిల్ వ్యూ స్టేడియం ప్రాంగణం నుంచి బాబా స్వర్ణరథంపై ఊరేగింపుగా యజ్ఞవేదిక వద్దకు చేరుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత... జరిగిన బాబా ఊరేగింపులో పలువురు భక్తులు పాల్గొన్నారు. పూర్ణాహుతి పూర్తయిన పిమ్మట బాబా కంచికామ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, శ్రీవిశ్వేశ్వర తీర్ధ వంటి పలువురు స్వామీజీలతో యజ్ఞ మండప ప్రధాన వేదిక ముందుభాగంలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆలయ మర్యాదలతో ఈవో రమణాచారి పట్టువస్త్రాలను బాబాకు అందజేశారు. యజ్ఞం ముగింపు సందర్భంగా సర్వదేవతల ఆరాధనతో అభిషేకించిన పవిత్ర నదీ, సముద్ర జలాలను హెలీకాప్టర్ ద్వారా భక్తులపై చల్లారు.

వెబ్దునియా పై చదవండి