ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే శ్రీ సాయి ప్రబోధనలు: రాష్ట్రపతి

PR
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో శుక్రవారం జరిగిన మహిళా దినోత్సవంలో భారత ప్రథమ పౌరురాలు ప్రతిభా పాటిల్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా 85వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగించారు. మూడు దశాబ్ధాలుగా ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హోదాలో రావడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రతిభా పాటిల్ అన్నారు.

శ్రీ సత్య సాయి బాబా 85వ పుట్టిన రోజు వేడుకలు నవంబర్ 23న జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిభా పాటిల్ మాట్లాడుతూ.. దివంగత భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జన్మదిన సందర్భంగా పుట్టపర్తిలో జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. సత్యసాయి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ సాయికి ప్రతిభా పాటిల్ శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ సత్యసాయి బాబా మరియు ఆయన నిర్వహించే ఆర్గనైజేషన్ మహిళా సాధికారితకు ఉపయోగపడుతుందన్నారు. సత్య సాయి ప్రబోధనలు ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంచేవిధంగా ఉంటాయని పాటిల్ ప్రశంసించారు. ఇదే కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ సత్య సాయి సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు.

ఇకపోతే.. నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ సత్యసాయి బాబా 85వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, పుట్టపర్తి ఆధ్యాత్మిక కళతో శోభిల్లుతోంది. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి